ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తి అంకాల ప్రుధ్వీరాజ్‌ను తెలంగాణలో పోలీసులు అరెస్ట్ చేసారంటూ ఒక వీడియో బాగా షేర్ చేస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న అనుమానంతో అతన్ని అరెస్ట్ చేసారని వీడియో ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తి అంకాల ప్రుధ్వీరాజ్‌ను మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న అనుమానంతో తెలంగాణలో పోలీసులు అరెస్ట్ చేసారు.
ఫాక్ట్: ఒక ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తిని మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న అనుమానంతో తెలంగాణలో పోలీసులు అరెస్ట్ చేసారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అసలు అంకాల ప్రుధ్వీరాజ్ అనే పేరుతో ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తి ఎవరూ లేరు. ఏపీ హైకోర్ట్ న్యాయవాది అంకాల ప్రుధ్వీరాజ్‌ను మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న అనుమానంతో అరెస్ట్ చేసారు. అతను ఒక న్యాయవాది (Lawyer), న్యాయమూర్తి (Judge) కాదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఒక ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తిని అరెస్ట్ చేసినట్టుగా ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటిది గనక జరిగుంటే, అన్నీ ప్రముఖ వార్తాపత్రికలు ఆ అరెస్ట్ గురించి ప్రచురించేవి. అంకాల ప్రుధ్వీరాజ్ అనే పేరుతో ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తి ఎవరూ లేరు.
కానీ ఏపీ హైకోర్ట్ న్యాయవాది అంకాల ప్రుధ్వీరాజ్‌ను మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న అనుమానంతో తెలంగాణలో పోలీసులు అరెస్ట్ చేసినట్టు న్యూస్ ఆర్టికల్స్ (ఇక్కడ మరియు ఇక్కడ) ద్వారా తెలుస్తుంది. ‘విజయవాడకు చెందిన ఎపి హైకోర్టు న్యాయవాది అంకాల పృథ్వీరాజ్ పూసుగుప్ప-ఛత్తీస్‌గఢ్‌లోని రాంపురం-మల్లంపేట అటవీ ప్రాంతంలోని మావోయిస్టు నేత దామోదర్‌ను కలిసి వస్తున్నట్లుగా తమ విచారణలో వెల్లడయిందని సిఐ అశోక్ తెలిపారు.’ ఆయనను అరెస్టుచేసి న్యాయస్థానానికి తరలించినట్లు కూడా తెలిపారు.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైటులో ప్రుధ్వీరాజ్ అనే పేరుతో ఉన్న న్యాయవాది గురించి వెతకగా, అతనికి సంబంధించిన వివరాలు లభించాయి. అతను ఒక న్యాయవాది (Lawyer) అని, న్యాయమూర్తి (Judge) కాదని తెలుస్తుంది.
2018లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ పోడిలె అప్పారావుని చంపడానికి కుట్ర పన్నినందుకు ఇద్దరు మాజీ విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను అప్పుడు అంధ్రప్రదేశ్ కు చెందిన 27 ఏళ్ల అంకాల ప్రుధ్వీరాజ్, పశ్చిమ బెంగాల్ కు చెందిన 28 ఏళ్ల చందన్ కుమార్ మిశ్రాగా గుర్తించినట్టు తెలుస్తుంది. వీళ్ళకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అప్పుడు తెలిపారు. 2013లో కూడా మావోయిస్ట్ చంద్రన్న భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆమెను చికిత్స కోసం ఖమ్మం తీసుకువెళుతున్న సమయంలో పాల్వంచ పోలీసులు అంకాల ప్రుధ్వీరాజ్‌ను అరెస్టు చేసి వరంగల్ లోని సెంట్రల్ జైలుకు పంపినట్టు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.
చివరగా, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న అనుమానంతో ఒక న్యాయవాదిని అరెస్ట్ చేసారనే వార్తను ఏపీ ‘హైకోర్ట్ న్యాయమూర్తి అరెస్ట్’ అని అంటున్నారు.