ఎయిర్ కండీషనరులు (AC) ఉపయోగించే వినియోగదారులు 4000 రూపాయల అదనపు విద్యుత్ చార్జీలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించలేదు

ఎయిర్ కండీషనరులు (AC) ఉపయోగించే వినియోగదారులు ఇక నుండి 4000 రూపాయల అదనపు విద్యుత్ చార్జీలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

ఈ పోస్టు యోక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఎయిర్ కండీషనరులు (ఏసి) ఉపయోగించే వినియోగదారులు ఇక నుండి 4000 రూపాయల అదనపు విద్యుత్ చార్జీలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది.

ఫాక్ట్ (నిజం): రిజిస్టర్ చేసుకున్న విద్యుత్ వినియోగం కన్నా అదనంగా ఉపయోగిస్తున్న విద్యుత్ లోడ్‌ను క్రమబద్ధికరించుకోవాలని విద్యుత్ అధికారులు ఒక వినియోగదారుడికి పంపిన నోటీసు చిత్రాన్ని ఈ పోస్టులో షేర్ చేసారు. దీని కోసం కట్టవలిసిన సర్వీస్ లైన్ చార్జీలు, డెవలప్మెంట్ చార్జీలు 30 రోజుల లోపు చెల్లించాలని ఈ నోటిసులో పేర్కొన్నారు. ఎయిర్ కండీషనర్ (AC) వినియోగం కారణంగానే ఈ అదనపు విద్యుత్ చార్జీలు వేస్తున్నట్టు ఈ నోటిసులో ఎక్కడా తెలపలేదు. ఈ నోటిసు కేవలం అదనపు విద్యుత్తు లోడ్ ఉపయోగిస్తున్న ఆ వినియోగదారుడికి మాత్రమే వర్తిస్తుంది. ఎయిర్ కండీషనరులు (AC) ఉపయోగించే వినియోగదారులకు నెలకు 4000 రూపాయులు అదనంగా ఛార్జ్ చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని జాగ్రత్తగా చదివితే, ఈ ఫోటోలో కనిపిస్తున్నది విద్యుత్ అధికారులచే ఒక వినియోగదారుడికి పంపిన ఒక నోటీసు అని స్పష్టమయ్యింది. రిజిస్టర్ చేసుకున్న విద్యుత్ వినియోగం కన్నా అదనంగా ఉపయోగిస్తున్న విద్యుత్ లోడ్‌కు వెంటనే క్రమబద్ధికరించుకొని, దానికి అవసరమైన సర్వీస్ చార్జీలను చెల్లించాలని విద్యుత్ అధికారులు ఈ నోటిసులో పేర్కొన్నారు. ఒప్పందం చేసుకున్నది 0.26 కిలోవాట్లు అయితే, 2.26 కిలోవాట్ల విద్యుత్ ఉపయోగిస్తున్నారని ఆ వినియోగదారుడికి ఈ నోటీసులో వివరించారు.  

అదనంగా ఉపయోగిస్తున్న 2 కిలోవాట్ల లోడ్‌కు సెక్యూరిటీ డిపాజిట్, డెవలప్మెంట్ చార్జీలు మరియు ఇతర సర్వీస్ చార్జీలును కలుపుకొని మొత్తంగా 4,068 రూపాయిలు కట్టాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ డబ్బులని  30 రోజుల లోపు చెల్లించాలని ఈ నోటిసులో హెచ్చరించారు.  APSPDCL నిబంధనల ప్రకారం 1,000 వాట్ల కన్నా అధిక విద్యుత్ లోడ్ వినియోగిస్తున్న వారికి, 1,200 జనరల్ చార్జీలు, ఆ తరువాత కిలోవాట్ పవర్‌కి 1,200 రూపాయిల చొప్పున చార్జ్ చేస్తారు. కొత్త కనెక్షన్ లేదా అదనపు విద్యుత్ వినియోగం కోసం చెల్లించవలిసిన చార్జీల పూర్తి వివరాలని ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరి కమిషన్ GTCS నిబంధనలను అనుసరించి ఈ సర్వీస్  చార్జీలను నిర్ణయిస్తారు.

ఇళ్ళలో ఉపయోగిస్తున్న ఎయిర్ కండీషనరులు సాధారణంగా 1,000 వాట్ల నుండి 2,000 వాట్ల విద్యుత్ సామర్ధ్యం కలిగి ఉంటాయి. AC వినియోగం కారణంగానే ఈ 2 కిలోవాట్ల అదనపు విద్యుత్ లోడ్ పెరిగిందని ఈ నోటీసులో ఎక్కడా తెలుపలేదు. ఈ నోటిసు కేవలం అదనపు విద్యుత్తు ఉపయోగిస్తున్న ఆ వినియోగదారుడికి మాత్రమే వర్తిస్తుంది. ఎయిర్ కండీషనరులు (AC) ఉపయోగించే వినియోగదారులకు నెలకు 4000 రూపాయిలు అదనంగా ఛార్జ్ చేయనున్నట్టు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. అదనపు లోడ్ అనేది అధిక విద్యుత్ వినియోగించే ఎటువంటి ఉపకారణం వల్లనైనా పడవచ్చు.

చివరగా, ఎయిర్ కండీషనరులు (AC) ఉపయోగించే వినియోగదారులు 4,000 రూపాయల అదనపు విద్యుత్ చార్జీలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించలేదు.