I-PAC ఆఫీసులో ఉన్న ఫోటోని ‘బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆఫీస్ లో జగన్ అన్న క్రేజ్’ అని షేర్ చేస్తున్నారు

YouTube Poster

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆఫీస్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ ఫోటో ఉన్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనెర్జీ నేతృత్వంలోని TMC పార్టీ భారీ మెజారిటీతో గెలిచి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ ఫోటో ఉన్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్నది కోల్కతా నగరంలో స్థాపించిన I-PAC సంస్థ ఆఫీసు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం మమతా బెనెర్జీ, I-PAC సంస్థ సహకారం తీసుకున్నారు. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని I-PAC సంస్థ, 2019 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం వై.యస్. జగన్ తో కలిసి పనిచేసారు. ఈ వీడియో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆఫీసులో తీసినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, ఇవే దృశ్యాలు కలిగన వీడియోని ఒక యూసర్ తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసినట్టు తెలిసింది. ‘Ravali Jagan Kavali Jagan in Kolkata IPAC office’, అనే టైటిల్ తో ఈ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ TMC పార్టీ భారీ మెజారిటీ తో గెలిచినందుకు గాను కోల్కతా లోని I-PAC ఆఫీసులో  వై.యస్. జగన్ ఎన్నికల ప్రచార పాటని ప్లే చేసినట్టు ఈ వీడియో వివరణలో తెలిపారు.

బెంగాల్ ఎన్నికల ఫలితాల తరువాత ప్రశాంత్ కిషోర్ ని ఇంటర్వ్యూ చేసిన India Today న్యూస్ ఛానల్, కొలకత్తా I-PAC ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులని ఇంటర్వ్యూ చేస్తూ ఆఫీసులోని దృశ్యాలను చూపించింది. ఆ ఇంటర్వ్యూ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్న ఆఫీసు ఇంటీరియర్  దృశ్యాలు, కొలకత్తా I-PAC ఆఫీసు ఇంటీరియర్ తో పోలి ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఈ ఆఫీసులో, I-PAC సంస్థ తాము ఇప్పటివరకు పనిచేసి, గెలిపించిన నాయకుల ఫోటోలని గోడల పై అమర్చింది. ప్రశాంత కిశోర్ నేతృత్వంలోని I-PAC సంస్థ, 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం వై.యస్. జగన్ తో కలిసి పనిచేసారు. కోల్కతా I-PAC ఆఫీసులో జగన్ ఫోటోలు కూడా ఉండటాన్ని మనం చూడవచ్చు.

ఈ వీడియోలో కనిపిస్తున్న మమతా బెనేర్జే బ్యానర్ పై ‘বাংলার গর্ব মমতা’ అనే బెంగాల్ అక్షరాలు రాసి ఉండటాన్ని మనం చూడవచ్చు. ఈ పదాలను ఇంగ్లీష్ భాషలోకి అనువదించి చూస్తే, దాని అర్ధం ‘Bengal Pride Mamata’ అని తెలిసింది. ప్రశాంత కిషోర్ I-PAC సంస్థ, 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం మమతా బెనర్జీ కి ఈ బ్రాండ్ పేరు వాడారు. మమతా బెనర్జీ కి వాడిన ఈ బ్రాండ్ పేరు గురించి ‘The Quint’ పబ్లిష్ చేసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్నది కోల్కతా లోని I-PAC ఆఫీస్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, కోల్కతా I-PAC ఆఫీసులోని దృశ్యాలని చూపిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆఫీసులో వై.యస్. జగన్ ఫోటో తగిలించినట్టు షేర్ చేస్తున్నారు.