భగవద్గీతను 6,7 తరగతుల NCERT పుస్తకాలలో పాఠ్యాంశాలుగా చేరుస్తామని అన్నపూర్ణ దేవి పార్లమెంటులో చెప్పలేదు

సెంట్రల్ సిలబస్‌లోని 6,7 తరగతులలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అలాగే 11,12 తరగతులలో కూడా సంస్కృత పుస్తకాలలో భగవద్గీత శ్లోకాలను పాఠ్యాంశంగా చేరుస్తామని కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి పార్లమెంటులో పేర్కొన్నట్లు ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. 

క్లెయిమ్: భగవద్గీతను 6,7 తరగతులలో పాఠ్యాంశంగా మరియు 11,12 తరగతుల సంస్కృతం పుస్తకాలలో భగవద్గీత శ్లోకాలను పాఠ్యాంశంగా చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంది అన్నపూర్ణ దేవి 19 డిసెంబర్ 2022లో పార్లమెంటులో పేర్కొన్నారు.

ఫాక్ట్: భగవద్గీత ప్రస్తావన 6,7 తరగతుల NCERT పుస్తకాలలో ఇప్పటికే ఉందని మరియు 11,12 తరగతుల సంస్కృతం పుస్తకాలలో భగవద్గీత శ్లోకాలు ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి 19 డిసెంబర్ 2022లో పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. అయితే, భారతీయ సాంప్రదాయ జ్ఞానాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చడానికి NCERT కసరత్తు చేస్తుందని కూడా ఆమె పేర్కొన్నారు. కానీ పోస్టులో చెప్పినట్లుగా 6, 7 తరగతుల NCERT పుస్తకాలలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేరుస్తున్నట్లు ఆమె చెప్పలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా ఈ విషయం గురించి పార్లమెంటులో విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణ దేవి 19 డిసెంబర్ 2022లో ఇచ్చిన రాతపూర్వక సమాధానాన్ని పరిశీలించాము. భగవద్గీతను పాఠ్య ప్రణాళికలో చేర్చడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో చెప్పమంటూ అడిగిన ప్రశ్నకు ఆమె జవాబిస్తూ ఈ విధంగా అన్నారు, “ NCERT సంస్థ National Curriculum Framework (NCF) అభివృద్ధి ప్రక్రియను ప్రారంభించింది, ఇందులో భాగంగా వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లు, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సలహాలు సూచనలను తీసుకుంటుంది. జాతీయ విద్య విధానం 2022 లోని 4.27 ప్యారా సుస్థిరమైన మరియు అందరి సంక్షేమం కోసం కృషి చేసే భారతదేశపు సాంప్రదాయ జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ శతాబ్దంలో దేశం గొప్ప స్థాయికి ఎదగాలంటే, మన వారసత్వాన్ని అర్థం చేసుకోవడం మరియు ప్రపంచానికి ‘భారతీయ మార్గాన్ని’ బోధించడం అత్యవసరం. విద్యా మంత్రిత్వ శాఖ 2020లో AICTEలో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ (IKS) విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది IKS యొక్క అన్ని అంశాలపై ఇంటర్ డిసిప్లినరీ మరియు ట్రాన్స్ డిసిప్లినరీ పరిశోధనలను ప్రోత్సహించడం, తదుపరి పరిశోధన మరియు సామాజిక అనువర్తనాల కోసం IKS పరిజ్ఞానాన్ని సంరక్షించడం మరియు వ్యాప్తి చేయడం వంటి దృష్టితో స్థాపించబడింది. ప్రస్తుతం ఉన్న NCERT పుస్తకాలలో, VI, VII పాఠ్యపుస్తకాలలో భగవద్గీత ప్రస్తావన ఉంది. అలాగే XI, XII సంస్కృతం పుస్తకాలలో భగవద్గీత శ్లోకాలు ఉన్నాయి.”

అయితే, NCERT పుస్తకాలలో భగవద్గీత ప్రస్తావన ఇప్పటికే ఉందని మాత్రమే ఆమె పేర్కొంది కానీ భగవద్గీత పాఠ్యాంశాలని చేరుస్తామని ఎక్కడా చెప్పలేదు. అలాగే నవంబర్ 2021లో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఇచ్చిన REFORMS IN CONTENT AND DESIGN OF SCHOOL TEXT BOOKS రిపోర్ట్లో కూడా NCERT పుస్తకాలో వేదాలు మరియు భగవద్గీతకు చెందిన సంక్షిప్త సమాచారాన్ని చేర్చాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మేము ఇదివరకే ప్రచురించిన వ్యాసంలో చూడవచ్చు.

ఇక 7వ తరగతి సామాజిక శాస్త్రం NCERT పుస్తకాన్ని పరిశీలించగా, అందులో భగవద్గీతతో పాటు ఖురాన్ మరియు ఇస్లాం మతాల ప్రస్తావన కూడా ఉంది.

చివరిగా, భగవద్గీతను 6,7 తరగతులలో పాఠ్యాంశంగా మరియు 11,12 తరగతుల సంస్కృతం పుస్తకాలలో భగవద్గీత శ్లోకాలను పాఠ్యాంశంగా చేరుస్తామని అన్నపూర్ణ దేవి పార్లమెంటులో చెప్పినట్లు ఎటువంటి ఆధారాలు లేవు.