తమ మీటింగులకి ప్రజలు రావడం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి విడదల రజిని అనలేదు

తమ మీటింగులకి ప్రజలు రావడం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి విడదల రజని ఒప్పుకున్నారని ఒక వీడియోను ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తమ మీటింగులకి ప్రజలు రావడం లేదని ఒప్పుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి విడదల రజిని వీడియో.

ఫాక్ట్: తమ మీటింగులకి ప్రజలు రావడంలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి విడదల రజిని అనలేదు. అసలు చంద్రబాబు నాయుడు మీటింగులకి ప్రజలు లేరని ఆమె తెలిపారు; ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కాదు. నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీ సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర జరుపుతుండగా మంత్రి విడదల రజిని చేసిన ప్రసంగంలో భాగంగా 23 సెకండ్ల వీడియో తీసి వైరల్ చేస్తున్నారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న పూర్తి వీడియో యూట్యూబ్‌లో లభించింది. 9:29 టైం ఫ్రేమ్ వద్ద యూట్యూబ్‌ వీడియోను కట్ చేసి 23 సెకండ్ల నిడివిగల ఈ వైరల్ వీడియోను షేర్ చేస్తున్నారు. నరసరావుపేటలో సామాజిక న్యాయభేరి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర జరిపుతుండగా మంత్రి విడదల రజిని చేసిన ప్రసంగంలో భాగంగా తీసింది ఈ వీడియో.

ఆ పూర్తి యూట్యూబ్‌ వీడియోలో ఎక్కడా కూడా తమ మీటింగులకి ప్రజలు రావడంలేదు అని ఆవిడ అనలేదు. అసలు చంద్రబాబు నాయుడు మీటింగులకి ప్రజలు లేరని ఆమె తెలిపారు; ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కాదు.

విడిదల రజిని గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజికవర్గం ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ వారు బస్సు యాత్ర నిర్వహించారు. అందులో మంత్రి విడిదల రజిని కూడా పాల్గొన్నారు. సామాజిక న్యాయభేరి యాత్ర విజయభేరి అవుతుందంటూ వ్యాఖ్యలు కూడా చేసారు. తమ మీటింగులకి జనాలు రావడంలేదని ఒప్పుకున్నట్టు ఎటువంటి రిపోర్ట్స్ కూడా లేవు.

చివరగా, తమ మీటింగులకి ప్రజలు రావడం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి విడదల రజిని అనలేదు.