ఆంధ్రప్రదేశ్ 2021లో విద్య అందుబాటు (Access To Education) అంశంలో మాత్రమే కేరళ కన్నా ముందు స్థానంలో నిలిచింది

విద్య అందుబాటు (Access To Education) అంశంలో కేరళను అధిగమించి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మద్దతుగా సాక్షి ప్రచురించిన వార్తాకథనం జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: విద్య అందుబాటు (Access To Education) అంశంలో కేరళను అధిగమించి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

ఫాక్ట్ (నిజం): ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా’ రిపోర్ట్ 2021 మరియు 2023ల ప్రకారం విద్య అందుబాటు (Access To Education) అంశంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలవలేదు. కేవలo 2021లో మాత్రమే కేరళ కన్నా ముందు స్థానంలో ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన అధికారిక X ఖాతాలో చేసిన పోస్ట్ నేపథ్యంలో ఈ వార్తా బాగా వైరల్ అవుతోంది. ముందుగా ఈ పోస్టులో ఉన్న సాక్షి వార్తాకథనం యొక్క ఫొటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే, ఈ ‘స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా’ నివేదిక గురించి సాక్షి పత్రిక 18 డిసెంబర్ 2021లో ప్రచురించిన వార్తాకథనం లభించింది.

సాక్షి ప్రచురించిన వార్తాకథనం ప్రకారం “ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా’ విడుదల చేసిన నివేదికలో చిన్న రాష్ట్రాల కేటగిరీలోని వివిధ అభివృద్ధి సూచికల్లో ‘విద్య అందుబాటు’ అనే అంశంలో ఏపీ 38.50 స్కోరుతో అగ్రస్థానంలో ఉంది. ఇతర అభివృద్ధి సూచికల విషయంలో అగ్రస్థానంలో ఉన్న కేరళ ఈ విషయంలో మాత్రం ఏపీకన్నా తక్కువగా 36.55 స్కోరు మాత్రమే సాధించింది.

ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా 2021

‘స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా 2021’ రిపోర్ట్ పిల్లల పూర్వ ప్రాథమిక విద్య, పునాది స్థాయి అక్షరాస్యత అంశాలను విశ్లేషించించి, పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో అక్షర, సంఖ్యా జ్ఞానాలకు సంబంధించి చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలెలా ఉన్నాయో చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అంశాల వారీ స్కోరును పొందుపరిచింది. విద్య మౌలిక సదుపాయాలు (Educational Infrastructure), విద్య అందుబాటు (Access To Education), కనీస ఆరోగ్యం (Basic Health), అభ్యాస ఫలితాలు (Learning Outcomes), పాలన (Governance) అనే ఐదు విభాగాల్లో, 41 అంశాలతో నేషనల్ అఛీవ్మెంటు సర్వే, యాన్యువల్ సర్వే ఆన్ ఎడ్యుకేషన్ రిపోర్టు డేటాతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు అని తెలుస్తుంది.

పైన పేర్కొన్న ఐదు విభాగాల్లో స్కోరుతో పాటు ఓవరాల్ స్కోర్ కూడా ఈ రిపోర్టులో తెలిపారు. ఓవరాల్ కేటగిరీని పరిశీలిస్తే చిన్న రాష్ట్రాల్లో కేరళ 67.95 స్కోరుతో, పెద్ద రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ 58.95 స్కోరుతో అగ్రస్థానంలో ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో లక్షద్వీప్ 52.69 స్కోరుతో, మిజోరం 51.64 స్కోరుతో ముందంజలో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ 49.85 స్కోరుతో చిన్న రాష్ట్రాల్లో 8వ స్థానంలో నిలిచింది.

అలాగే  ‘విద్య అందుబాటు’ (Access To Education) అనే విభాగంలో వివిధ రాష్ట్రాల స్కోరును పరిశిలించగా చిన్న రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ 39.94 స్కోరుతో, పెద్ద రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ 47.90 స్కోరుతో, ఈశాన్య రాష్ట్రాల్లో మేఘాలయా 63.44 స్కోరుతో ముందంజలో ఉన్నాయి. ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్ 38.50 స్కోరుతో 4వ స్థానంలో నిలిచింది, కేరళ 36.55 స్కోరుతో 5వ స్థానంలో నిలిచింది. కావున, ‘స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా 2021’ రిపోర్ట్ ప్రకారం‘విద్య అందుబాటు’ అనే విభాగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలవలేదు, కేవలం కేరళ కన్నా ముందంజలో ఉన్నది.

ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా 2023

అలాగే చివరగా ఫిబ్రవరి 2023లో వచ్చిన ‘ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా’ రిపోర్ట్  పరిశీలించగా విద్య మౌలిక సదుపాయాలు, విద్య అందుబాటు, కనీస ఆరోగ్యం, అభ్యాస ఫలితాలు, పాలన అనే ఐదు విభాగాల్లో, 36 అంశాలతో నేషనల్ అఛీవ్మెంటు సర్వే, యాన్యువల్ సర్వే ఆన్ ఎడ్యుకేషన్ రిపోర్టు డేటాతో పాటు ఆయా రాష్ట్రాల ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు అని తెలుస్తుంది.

ఓవరాల్ కేటగిరీని పరిశీలిస్తే చిన్న రాష్ట్రాల్లో పంజాబ్ 64.19 స్కోరుతో, పెద్ద రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ 54.58 స్కోరుతో అగ్రస్థానంలో ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో పుదుచ్చేరి 54.76 స్కోరుతో, సిక్కిం 56.75 స్కోరుతో ముందంజలో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ 39.02 స్కోరుతో చిన్న రాష్ట్రాల్లో 10వ స్థానంలో నిలిచింది.

‘విద్య అందుబాటు’ అనే విభాగంలో వివిధ రాష్ట్రాల స్కోరును పరిశిలించగా చిన్న రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ 55.47 స్కోరుతో ముందంజలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ జాతీయ సగటు (43.28) కన్నా తక్కువగా 38.25 స్కోరుతో 9వ స్థానంలో నిలిచింది, కేరళ 48.55 స్కోరుతో 3వ స్థానంలో నిలిచింది. కావున ‘స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా 2023’ రిపోర్ట్ ప్రకారం ‘విద్య అందుబాటు’ అనే విభాగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలవలేదు, కేరళ కన్నా వెనకంజలో ఉన్నది.

చివరగా, ఆంధ్రప్రదేశ్ కేవలo 2021లో విద్య అందుబాటు (Access To Education) అంశంలో మాత్రమే కేరళ కన్నా ముందు స్థానంలో నిలిచింది.