నేపాల్‌లో జరిగిన Gen-Z నిరసనలకు సంబంధించిన ఒక వీడియోను, నవంబర్ 2025లో బీహార్ ఎన్నికల తర్వాత జరిగిన నిరసన దృశ్యాలు అని తప్పుగా షేర్ చేస్తున్నారు

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నిర్ణయాత్మక విజయాన్ని సాధించింది, 243 సీట్లలో 202 సీట్లను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో, బీహార్ ఎన్నికల ఫలితాలతో ఆగ్రహంగా ఉన్న అక్కడి ప్రజలు నిరసనలు చేపడుతున్నారని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ‘బీహార్ ఫలితాలు మొత్తం EVM లతో తారుమారు అయిన వైనాన్ని పరిస్థితిని మెజారిటీ ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. ఆ కారణాలతో బీహార్ రాష్ట్రం అట్టుడుకుతున్నట్లు అతలాకుతం అవుతున్నట్లు పరిస్థితులనుబట్టి తెలుస్తోంది, కనపడుతోంది మరియు అర్థమవుతోంది.,’ అని చెప్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నవంబర్ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ జరిగిన తీవ్ర నిరసనను ఈ వీడియో చూపిస్తుంది. 

ఫ్యాక్ట్(నిజం): 09 సెప్టెంబర్ 2025న నేపాల్‌లోని చిట్వాన్‌లో జరిగిన Gen-Z నిరసనల సందర్భంగా జరిగిన హింసను ఈ వీడియో చూపిస్తుంది. దీనికి భారతదేశంలోని బీహార్‌కు ఎలాంటి సంబంధం లేదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి ముందుగా, అసలు 2025 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైరల్ వీడియోలో చూపిస్తున్న నిరసన బీహార్‌లో జరిగింది అని ఏవైనా ఆధారాలు ఉన్నాయా తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికాము.

అయితే, ఈ సెర్చ్ ద్వారా, ఎన్నికల్లో NDA విజయం తర్వాత, బీహార్‌లో జరిగిన నిరసనల గురించి మాకు ఎలాంటి విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేదు. వైరల్ వీడియో బీహార్‌లో జరిగిన ఒక నిరసనను చూపిస్తుందని కూడా మాకు ఎలాంటి వార్తా కథనాలు లభించలేదు.

తర్వాత, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను ఉపయోగించి ఇంటర్నెట్‌లో ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, నవంబర్ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, 13 సెప్టెంబర్ 2025న అప్‌లోడ్ చేయబడిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్ మాకు లభించింది. ఇందులో ఇప్పుడు వైరల్ అవుతున్న అదే వీడియో ఉంది. ఆ వీడియో నేపాల్‌లో తీసిందని ఈ పోస్ట్ పేర్కొంది.

అదనంగా, ఈ వీడియో తీసిన అదే ప్రదేశంలో జరిగిన హింసాత్మక నిరసనలను చూపిస్తున్న అనేక సోషల్ మీడియా పోస్ట్‌లు (ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. ఈ పోస్ట్‌లలో ఒక దానిలో, వైరల్ వీడియోలో కనిపించే భవనం స్పష్టంగా కనిపించే దృశ్యాలు ఉన్నాయి. ఆ భవనంపై “నేపాల్ ప్రభుత్వం, హోం మంత్రిత్వ శాఖ, జిల్లా పరిపాలన కార్యాలయం, భరత్‌పూర్, చిట్వాన్” అని నేపాలీలో రాసి ఉంది.

వైరల్ వీడియోలో కనిపిస్తున్న భవనం, నేపాల్‌లోని చిట్వాన్‌లోని జిల్లా పరిపాలన కార్యాలయం అని మేము గూగుల్ మ్యాప్స్ సహాయంతో గుర్తించాము. ఈ క్రింది ఫొటోలో మీరు ఈ విషయాన్ని స్పష్టంగా గమనించవచ్చు.

వార్తా కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), 09 సెప్టెంబర్ 2025న, Gen-Z నిరసనకారులు చిట్వాన్‌తో సహా అనేక జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీ భవనాలపై దాడి చేశారు. ఈ సమయంలో వారు కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పంటించారు. ఈ ఆధారాలను బట్టి, ఈ వీడియోకు, భారతదేశంలోని బీహార్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం అవుతుంది.

చివరగా, నేపాల్ యొక్క Gen-Z నిరసనలకు చెందిన ఒక సంబంధం లేని వీడియోను, 2025 బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ జరిగిన ఒక నిరసనను చూపిస్తున్న వీడియో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.