2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో EVM స్కామ్ జరిగిందని అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సయోని ఘోష్ పార్లమెంటులో అన్నారని చెప్తూ, ఒక సంబంధం లేని వీడియోని షేర్ చేస్తున్నారు

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సయోని ఘోష్ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో EVM స్కామ్ జరిగిందని పార్లమెంటులో అన్నారని చెప్తూ, ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఈ స్కామ్‌కు ప్రధాన కారణం ఒక ఒక సీనియర్ ప్రజాప్రతినిధి అని ఆమె అన్నారని, ఈ పోస్టులలో క్లెయిమ్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో EVM స్కామ్ జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సయోని ఘోష్ పార్లమెంటులో అంటున్న వీడియో.  

ఫ్యాక్ట్(నిజం): 29 జూలై 2025న అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సయోని ఘోష్ ఆపరేషన్ సింధూర్ గురించి లోక్ సభలో చేసిన వ్యాఖలకు చెందిన చిన్న వీడియో క్లిప్ ఇది. తన పూర్తి సంభాషణలో ఎక్కడ కూడా తను 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో EVM స్కామ్ జరిగిందని అనలేదు.  కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, ముందుగా, వైరల్ వీడియోలో సయోని ఘోష్ చేసిన వ్యాఖ్యలను వినగా, తను ఇందులో ఎక్కడా కూడా వైరల్ క్లెయిములో చెప్తున్నట్లు, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి కానీ EVM స్కామ్ గురించి కానీ మాట్లాడ లేదని మాకు తెలిసింది. ఈ వీడియోలో తను ఆపరేషన్ సింధూర్ గురించి, తీవ్రవాద దాడుల గురించి మాట్లాడారు.  అలాగే, సయోని ఘోష్ ఇటీవల వైరల్ క్లెయిములో చెప్తున్నటువంటి వ్యాఖలు చేశారని చెప్తూ, మాకు ఎటువంటి వార్తా కథనాలు దొరకలేదు. 

ఆ తర్వాత, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ వీడియో యొక్క పూర్తి వెర్షన్ మాకు సంసద్ టీవీ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో దొరికింది.  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏంపీ (జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం) సయోని గోష్, 29 జూలై 2025న లోక్ సభలో ‘ఆపరేషన్ సింధూర్’ పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇది. 

వైరల్ వీడియోలో ఉన్న క్లిప్స్ మనం ఈ వీడియోలో 2:57, 3:31, 5:18 మార్క్‌ల దగ్గర, పలు చోట్ల చూడవచ్చు. అలాగే 29 జూలై 2025న తను చేసిన ఈ ప్రసంగం యొక్క ట్రాన్స్‌స్క్రిప్ట్ మాకు సంసద్ వెబ్సైటులో లభించింది.   

తన ప్రసంగాన్ని సయోని బెంగాలీ, హిందీ, ఆంగ్ల భాషల్లో చేశారు. 22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడి, ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ఇందులో ఆమె మాట్లాడారు. అలాగే, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని దేశ ద్రోహులు అని అనడం పైన, పాక్ ఆక్రమిత కశ్మీర్ పైన భారత ప్రభుత్వ వైఖరి, ఆపరేషన్ సింధూర్‌లో అమెరికా జోక్యం చేసుకోవడం వంటి పలు విషయాలపై, భారత ప్రభుత్వంపై తను విమర్శల వర్షం కురిపించారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) . అంతే కానీ, తన ప్రసంగంలో ఎక్కడా కూడా, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో EVM స్కామ్ జరిగిందని సయోని అనలేదు/ఆరోపించలేదు.

చివరగా, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో EVM స్కామ్ జరిగిందని అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సయోని ఘోష్ పార్లమెంటులో చెప్పలేదు.