అక్టోబర్‌ 2025లో నేపాల్‌లో దుర్గామాత ఊరేగింపుపై రాళ్లు రువ్విన వారి ఆస్తులను ‘జెన్ Z’ బుల్డోజర్‌తో కూల్చివేసింది అంటూ సంబంధంలేని వీడియోను షేర్ చేస్తున్నారు

ఇటీవల 03 అక్టోబర్‌ 2025న నేపాల్‌లోని జనక్‌పూర్‌లో ఓ మసీదు వద్ద దుర్గామాత ఊరేగింపుపై రాళ్ల దాడి జరిగినట్లు పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలో,“నేపాల్‌లో ఆరంగేట్రం చేసిన బుల్డోజర్, దుర్గా ఊరేగింపుపై రాళ్లిసిరిన మందల ఆస్తులు నేలమట్టం,బోనస్‌గా MASJID (మసీదు) కు నిప్పంటించిన జెన్ Z” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో, ఒక భారీ ఎక్స్కవేటర్ కాలిపోతున్న వాహనాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అక్టోబర్‌ 2025లో నేపాల్‌లో దుర్గామాత ఊరేగింపుపై రాళ్లు రువ్విన వారి ఆస్తులను ‘జెన్ Z’ బుల్డోజర్‌తో కూల్చివేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): 03 అక్టోబర్‌ 2025న నేపాల్‌లోని జనక్‌పూర్‌లో దుర్గామాత ఊరేగింపుపై జరిగిన రాళ్ల దాడి సంఘటనకు, ఈ వైరల్ వీడియోకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో రాళ్ల దాడి సంఘటనకు ముందే, 10 సెప్టెంబర్ 2025 నుండి ఇంటర్నెట్‌లో ఉంది. అంతేకాకుండా, దుర్గామాత ఊరేగింపుపై రాళ్లు రువ్విన వారి ఆస్తులను కానీ మసీదును కానీ ‘జెన్ Z’ లేదా అక్కడి ప్రభుత్వం బుల్డోజర్‌తో కూల్చివేసినట్లు కూడా ఎటువంటి రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను చూపిస్తున్న వీడియోను, సెప్టంబర్ 2025లో పలువురు సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు మేము గుర్తించాము (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోను షేర్ చేస్తూ, ఈ వీడియోలోని దృశ్యాలు సెప్టెంబర్ 2025లో నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ‘జెన్ జెడ్’ నిరసనలకు సంబంధించినవని పలువురు యూజర్లు పేర్కొన్నారు. దీన్ని బట్టి 03 అక్టోబర్ 2025న నేపాల్‌లోని జనక్‌పూర్‌లో ఓ మసీదు వద్ద దుర్గామాత ఊరేగింపుపై జరిగిన రాళ్ల దాడి సంఘటనకు ఈ వైరల్ వీడియోకు ఎటువంటి సంబంధం లేదని మనం నిర్థారించవచ్చు.

అంతేకాకుండా, ఇటీవల నేపాల్‌లోని జనక్‌పూర్‌లో ఓ మసీదు వద్ద దుర్గామాత ఊరేగింపుపై రాళ్లు రువ్విన వారి ఆస్తులను, ఆ మసీదును ‘జెన్ Z’ లేదా అక్కడి ప్రభుత్వం బుల్డోజర్‌తో కూల్చివేసినట్లు కూడా ఎటువంటి రిపోర్ట్స్ లేవు.

చివరగా, 2025 అక్టోబర్‌లో నేపాల్‌లో దుర్గామాత ఊరేగింపుపై రాళ్లు విసిరిన వారి ఆస్తులను జెన్ Z బుల్డోజర్‌తో కూల్చివేసింది అంటూ సంబంధంలేని వీడియోను షేర్ చేస్తున్నారు.