మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం వచ్చిన మహిళను దిగ్విజయ్ సింగ్ గెంటేయించాడు అంటూ సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం కింద ప్రతి నిరుపేద మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి ప్రతి నెల రూ. 8,500/ ప్రతి సంవత్సరానికి లక్ష రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరవాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన క్రమంలో ఒక మహిళ ఈ పథకం కింద హామీ ఇచ్చిన డబ్బు కోసం కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వద్దకు వస్తే ఆమెను గెంటేసారు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ & ఇక్కడ). ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం కింద  హామీ ఇచ్చిన డబ్బు కోసం దిగ్విజయ్ సింగ్ వద్దకు వచ్చిన మహిళను గెంటేస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో సంఘటన ఎన్నికల ముందు దిగ్విజయ్ సింగ్ స్థానిక పార్టీ కార్యకర్తలతో సమావేశమైనప్పుడు జరిగింది. డాక్టర్ లీనా శర్మ అనే మహిళ కార్యకర్త, లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీపై పోటీ చేసేందుకు వారణాసి ఎంపీ టికెట్‌ కోసం దిగ్విజయ్‌ సింగ్‌ను కలిసేందుకు వెళ్లగా, దిగ్విజయ్ సింగ్ ఆమెను గెంటివేయించినట్టు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ సంఘటనకు మహాలక్ష్మి పథకానికి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో మహాలక్ష్మి పథకం ద్వారా ఏటా నిరుపేద మహిళల ఖాతాల్లోకి లక్ష రూపాయలు జమచేస్తామని హామీ ఇచ్చిన మాట నిజమే అయినప్పటికీ, ప్రస్తుతం షేర్ చేస్తున్న వీడియోకు ఆ పథకానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం వెతకగా ఈ సంఘటనను ఫిబ్రవరి 2024లో రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి.

ఈ కథనాల ప్రకారం ఈ ఘటన గ్వాలియర్‌లో దిగ్విజయ్ సింగ్ స్థానిక పార్టీ కార్యకర్తలతో సమావేశమైనప్పుడు జరిగింది. కాగా ఆ మహిళ పేరు డాక్టర్ లీనా శర్మ, ఆమె గుణ జిల్లాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త. 2024 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీపై పోటీ చేసేందుకు వారణాసి ఎంపీ టికెట్‌ కోసం దిగ్విజయ్‌ సింగ్‌ను కలిసేందుకు వెళ్లగా, దిగ్విజయ్ సింగ్ ఆమెను గెంటివేయించినట్టు వార్తా కథనాలు పేర్కొన్నాయి.

ఈ క్రమంలోనే ‘ఆమె పిచ్చిది, ఆమెను గెంటేయండి’ అని ఆమెను ఉద్దేశించి దిగ్విజయ్ సింగ్ అన్నట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేశాయి. ఈ సంఘటనను రిపోర్ట్ చేసిన మరికొన్ని కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటిబట్టి ఈ వీడియోకు మహాలక్ష్మి పథకానికి ఎటువంటి సంబంధం లేదని , ఈ సంఘటన 2024 లోక్ సభ ఎన్నికల ముందు రిపోర్ట్ అయ్యిందని స్పష్టమవుతుంది.

చివరగా, మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం వచ్చిన మహిళను దిగ్విజయ్ సింగ్ గెంటేయించాడు అంటూ సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు.