ఇరాన్‌ అణు స్థావరాలపై దాడికి వ్యతిరేకంగా అమెరికన్ ప్రజలు నిరసిస్తున్నారంటూ సంబంధంలేని వీడియోని షేర్ చేస్తున్నారు

22 జూన్ 2025న ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో, ఇరాన్‌పై దాడిని వ్యతిరేకిస్తూ అమెరికాలో లక్షలాది అమెరికన్లు వీధుల్లోకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ)  సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

A screenshot of a video

AI-generated content may be incorrect.
ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: 22 జూన్ 2025న ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా చేసిన దాడిని వ్యతిరేకిస్తూ అమెరికన్లు నిరసనలు చేపట్టినప్పటి దృశ్యాలు.

ఫాక్ట్: ఈ వీడియో 14 జూన్ 2025లో శాన్ డియాగో నగరంలో జరిగిన ‘నో కింగ్స్’ అనే నిరసన కార్యక్రమానికి సంబంధించినది. ట్రంప్ తీసుకున్న వివిధ నిర్ణయాలు, విధానాలకు వ్యతిరేకంగా ఈ నిరసనలు జరిగాయి. అయితే, ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా 22 జూన్ 2025న చేసిన దాడిని వ్యతిరేకిస్తూ అమెరికాతో పాటు వివిధ దేశాలలో నిరసన కార్యక్రమాలు జరిగాయి, కాకపోతే ఈ దృశ్యాలు ఆ నిరసనలకు సంబంధించినవి కాదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా, వైరల్ వీడియోలోని దృశ్యాలు రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోని 15 జూన్ 2025న ‘jess_porter_official’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 14 జూన్ 2025లో శాన్ డియాగో నగరంలో జరిగిన ‘నో కింగ్స్’ అనే నిరసన కార్యక్రమాన్ని ఈ వీడియో చూపుతుందని పోస్టులో పేర్కొనబడింది. ఈ నిరసనలో 80,000 మంది పాల్గొన్నారని, దేశవ్యాప్తంగా ఈ నిరసనలు జరిగాయని పోస్టులో చెప్పబడింది.

అమెరికన్ మీడియా కథనాల (ఇక్కడ & ఇక్కడ) ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తీసుకున్న వలసదారుల బహిష్కరణ, సంక్షేమ పథకాల తగ్గింపు, పౌర హక్కులపై దాడి, నిరంకుశ చర్యలు, ఉద్యోగాల కోత వంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా అమెరికాలోని శాన్ డియాగో నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో 14 జూన్ 2025న ‘నో కింగ్స్’ పేరుతో భారీ నిరసన కార్యక్రమాలకు జరిగాయి. వైరల్ వీడియోని పోలిన దృశ్యాలను ఈ కార్యక్రమానికి సంబంధించినవిగా వివిధ అమెరికన్ మీడియా సంస్థలు (ఇక్కడ & ఇక్కడ) కూడా ప్రసారం చేశాయి. అయితే, ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా దాడి చేసింది 22 జూన్ 2025 కాబట్టి వైరల్ వీడియో ఈ దాడిని వ్యతిరేకిస్తూ చేసిన నిరసన కార్యక్రమానికి సంబంధించినది కాదని స్పష్టమవుతుంది.

అయితే, ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడిని వ్యతిరేకిస్తూ అమెరికాతో పాటు వివిధ దేశాలలో నిరసన కార్యక్రమాలు జరిగినట్లు పలు మీడియా సంస్థలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) పేర్కొన్నాయి.

చివరిగా, ఇరాన్‌ అణు స్థావరాలపై దాడికి వ్యతిరేకంగా అమెరికన్ ప్రజలు నిరసిస్తున్నారంటూ సంబంధంలేని వీడియోని షేర్ చేస్తున్నారు.