బీఆర్ గవాయ్‌పై షూ విసిరిన రాకేష్ కిషోర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారంటూ సంబంధంలేని వీడియోని షేర్ చేస్తున్నారు

06 అక్టోబర్ 2025న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై రాకేష్ కిషోర్ అనే న్యాయవాది షూ విసిరిన నేపథ్యంలో, రాకేష్ కిషోర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

A person wearing glasses

AI-generated content may be incorrect.
ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై షూ విసిరిన న్యాయవాది రాకేష్ కిషోర్‌పై జరిగిన దాడికి సంబంధించిన వీడియో.

ఫాక్ట్: ఈ వీడియో అక్టోబర్ 2011 నాటిది. కశ్మీర్ అంశంపై చేసిన వ్యాఖ్యల కారణంగా న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటనను ఈ వీడియో చూపుతుంది. రాకేష్ కిషోర్‌ అంశానికి దీనితో ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చెయ్యబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా, వైరల్ వీడియోని పరిశీలించగా, సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది, అన్నా హజారే బృందం సభ్యుడు ప్రశాంత్ భూషణ్‌పై ఆయన ఛాంబర్‌లో జరిగిన దాడికి సంబంధించిన వీడియో అని ఇందులో చెప్పడం చూడవచ్చు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వీడియోని పరిశీలించగా, ఈ వీడియోని టైమ్స్ నౌ యూట్యూబ్ ఛానెల్లో అక్టోబర్ 2011లో అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. ఇదే వీడియో ఇక్కడ & ఇక్కడ కూడా చూడవచ్చు.

వార్తా కథనాల (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ప్రకారం, ప్రశాంత్ భూషణ్ కశ్మీర్ అంశంపై చేసిన వ్యాఖ్యల కారణంగా, 12 అక్టోబర్ 2011లో సుప్రీం కోర్టు కాంప్లెక్స్ లోని ఆయన ఛాంబర్‌లోకి కొందరు వ్యక్తులు చొరబడి ఆయనపై దాడి చేశారు. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇక, బీఆర్ గవాయ్ విషయంలో రాకేష్ కిషోర్‌పై దాడి జరిగినట్లు ఎటువంటి మీడియా కథనాలు లభించలేదు. అయితే, ఈ ఘటన కారణంగా రాకేష్ కిషోర్‌పై కేసు నమోదైంది. అలాగే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ బార్ కౌన్సిల్ రాకేష్ కిషోర్ సభ్యత్వాన్ని, లైసెన్స్‌ను రద్దు చేశాయి.

చివరిగా, బీఆర్ గవాయ్‌పై షూ విసిరిన రాకేష్ కిషోర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారంటూ సంబంధంలేని వీడియోని షేర్ చేస్తున్నారు.