ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తమిళ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ జెండాను పట్టుకున్నాడని ఒక సంబంధం లేని వీడియోని షేర్ చేస్తున్నారు

నటుడు, జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తమిళ నటుడు విజయ్ స్థాపించిన పార్టీ టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ జెండాను పట్టుకున్నాడని చెప్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పవన్ ఒక సభలో స్టేజీపై తన చేతిలో జనసేన పార్టీ జండా లాగా ఉన్న ఒక తెలుపు జెండాతో పాటు పచ్చ, ఎరుపు రంగులో ఉన్న ఇంకో జెండాను పట్టుకోవడం మనం చూడవచ్చు. ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు మీరు ఇక్కడ చూడవచ్చు.   

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: పవన్ కళ్యాణ్ ఒక సభలో స్టేజి పైన టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ జెండాను పట్టుకున్న వీడియో. 

ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ పట్టుకున్న జెండా టీవీకే పార్టీది కాదు. ఇది కర్ణాటక రాష్ట్రం వారి అనధికారిక జెండాను పోలిన జెండా. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటెర్నెట్‌లో వెతుకగా, GulteOfficial వారి ‘X’ హ్యాండిల్‌లో మార్కు ఈ వీడియో క్లిప్ యొక్క మరో వెర్షన్ మాకు దొరికింది. ఈ వీడియోలో, వైరల్ వీడియోలో లాగా పవన్ కళ్యాణ్ రెండు జెండాలు పట్టుకోవడం మనం చూడవచ్చు.

‘సేనతో సేనాని’ కార్యక్రమంలో, పవన్ కళ్యాణ్ ఈ విధంగా జనసేన జెండాతో పాటు కర్ణాటక జెండాను పట్టుకున్నాడని ఈ పోస్టులో చెప్పారు. ఆ తర్వాత తగిన కీవర్డ్స్ ఉపయోగించి, సేనతో సేనాని కార్యక్రమానికి సంబంధించిన వీడియోల గురించి ఇంటెర్నెట్‌లో మేము వెతికాము. ఈ సెర్చ్ ద్వారా, జనసేన పార్టీ వారి అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో 30 ఆగస్ట్ 2025న లైవ్ స్ట్రీమ్ అయిన ‘సేనతో సేనాని’ కార్యక్రమం యొక్క వీడియో మాకు లభించింది. ఈ కార్యక్రమం విశాఖపట్నంలో జరిగింది.

ఈ వీడియోలో 2:09:35 సెకన్ల దగ్గర మనం పవన్ కళ్యాణ్ వైరల్ వీడియోలో కనిపిస్తున్నట్లుగా, స్టేజీపై రెండు జెండాలను పట్టుకోవడం చూడవచ్చు. పవన్ కళ్యాణ్ పట్టుకున్న జెండా గురించి ‘Gulte’ వారి ‘X’ పోస్టులో ఇచ్చిన వివరణ ఆధారంగా, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటెర్నెట్‌లో వెతికాము. ఈ సెర్చ్ ద్వారా, ఈ పసుపు, ఎరుపు రంగులో ఉన్న జెండా, కర్ణాటక రాష్ట్రం యొక్క అనధికారిక జెండాను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) తలిపించే జెండా అని మాకు తెలిసింది. ఈ జెండా వంటి జెండాలు, పలు ఈ-కామర్స్ వెబ్సైటులలో కూడా విక్రయానికి ఉన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). 

పవన్ కళ్యాణ్ పట్టుకున్న జెండాను మేము తమిళ నటుడు విజయ్ స్థాపించిన పార్టీ టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ జెండాతో పోల్చి చూస్తే, ఈ రెండు వేరు వేరు అని మాకు తెలిసింది. తమిళగ వెట్రి కళగం యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో 22 ఆగస్ట్ 2024న స్ట్రీమ్ చేసిన టీవీకే జండా ఆవిష్కరణ సభ దృశ్యాల్లో, మనం టీవీకే జెండాను చూడవచ్చు.

ఈ జెండాలో పైన కింద ఉన్న బ్యాండులు ఎరుపు రంగులో ఉండగా, మధ్యలో బ్యాండు పసుపు రంగులో ఉంది. అలాగే, ఈ పసుపు బ్యాండులో రెండు ఏనుగులు మరియు ఒక వాగై పువ్వు ఉంది (ఇక్కడ, ఇక్కడ). ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని మీరు ఈ కింది కొల్లాజ్‌లో చూడవచ్చు. 

కర్ణాటక రాష్ట్ర అనధికారిక జండాను మా. రామమూర్తి అనే వ్యక్తి 1960లలో డిజైన్ చేశారు. అయితే 2018లో కర్ణాటక ప్రభుత్వ కేబినెట్, ఆ రాష్ట్రానికి జెండాగా, ఎరుపు, పసుపుతో పాటు తెలుపు రంగు ఉన్న ఒక కొత్త జండా డిజైన్ ప్రతిపాధనలోకి తీసుకొచ్చింది (ఇక్కడ, ఇక్కడ). అది ఇప్పటివరకు భారత భారత ప్రభుత్వంచే అధికారికంగా ఆమోదించబడలేదు

చివరగా, జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తమిళ నటుడు విజయ్ స్థాపించిన పార్టీ టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ జెండాను పట్టుకున్నాడని ఒక సంబంధం లేని వీడియోని షేర్ చేస్తున్నారు