సియాచిన్‌లో విధులు నిర్వహిస్తున్న భారత సైనికుల దృశ్యాలంటూ సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు

సియాచిన్‌లో భారత సైనికుల దృశ్యాలను చూపిస్తున్నట్లు పేర్కొంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). సరిహద్దుల్లో కఠిన పరిస్థితులలో దేశాన్ని రక్షిస్తున్న సైన్యాన్ని ప్రశంసిస్తూ ఈ పోస్ట్ షేర్ చేయబడుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సియాచిన్‌లో విధులు నిర్వహిస్తున్న భారత సైనికుల దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోకు, సియాచిన్‌కు సంబంధం లేదు. ఈ వీడియో భారత పర్వతారోహకుడు నరేంద్ర కుమార్ నేతృత్వంలోని బృందం మెక్సికోలోని 5,636 మీటర్లు (18,491 అడుగులు) ఎత్తున్న పికో డి ఒరిజాబాను అధిరోహిస్తున్న దృశ్యాలను చూపిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను 14 డిసెంబర్ 2025న భారతీయ పర్వతారోహకుడు నరేంద్ర కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అప్‌లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము. పోస్ట్ వివరణలో, మెక్సికోలోని ఒరిజాబా శిఖరాన్ని నరేంద్ర కుమార్ తన టీమ్‌తో (@ruslan_gazonio  @pankuspan  @alex.abramov.everest) కలిసి అధిరోహించినప్పుడు తీసిన వీడియో అని ఆయన పేర్కొన్నారు.

ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ డిసెంబర్ 2025లో ప్రచురించబడిన పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాలు ప్రకారం, హర్యానాలోని హిసార్‌కు చెందిన పర్వతారోహకుడు నరేంద్ర కుమార్ నేతృత్వంలోని పర్వతారోహకులు టీమ్ మెక్సికోలోని పికో డి ఒరిజాబాను విజయవంతంగా అధిరోహించింది. 5,636 మీటర్ల (18,491 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ శిఖరం మెక్సికోలోనే అత్యంత ఎత్తైనదిగా, ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద అగ్నిపర్వతం. కఠినమైన శీతాకాల పరిస్థితుల్లో జమాపా గ్లేసియర్ మార్గం ద్వారా ఈ ఆరోహణను పూర్తి చేయడం భారతీయ పర్వతారోహణలో ఒక ముఖ్యమైన విజయం అని కథనాలు పేర్కొన్నాయి. దీన్ని బట్టి, సియాచిన్‌లో పోస్ట్ చేయబడిన భారతీయ సైనికులకు ఎటువంటి సంబంధం లేదని మాకు స్పష్టమైంది.

చివరిగా, సియాచిన్‌లో విధులు నిర్వహిస్తున్న భారత సైనికుల దృశ్యాలంటూ సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు.