ఇటీవల విజయవాడలో వచ్చిన వరదలకు సంబంధించిన దృశ్యాలు అంటూ సంబంధం లేని పాకిస్థాన్‌కు చెందిన వీడియోను షేర్ చేస్తున్నారు

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఉధృతమైన వరదలు వచ్చాయి. తీవ్రమైన వర్షపాతం మరియు వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి, బుడమేరు వరదలతో సగానికి పైగా విజయవాడ నగరం నీటిలో మునిగిపోయింది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ నేప‌థ్యంలో, “ఇటీవల విజయవాడలో వచ్చిన వరదల దృశ్యాలు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో నీటిలో తేలియాడుతున్న చాలా మంది మనుషులను యొక్క ఏరియ‌ల్ వ్యూను చూపించడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవల విజయవాడలో వచ్చిన వరదల దృశ్యాలను చూపిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు ఇటీవల విజయవాడలో వచ్చిన వరదలకు సంబంధించినవి కావు. ఈ వీడియోలోని దృశ్యాలు పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని తట్టా జిల్లాలో ఉన్న ‘కీంజర్ సరస్సు లేదా కర్లీ సరస్సు’కు సంబంధించినవి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను(ఆర్కైవ్డ్ లింక్) ‘వెదర్ అప్‌డేట్స్ కరాచీ(Weather Updates Karachi)’ అనే పాకిస్థాన్‌కి  చెందిన ఫేస్‌బుక్‌ పేజీ 15 జూలై 2024న షేర్ చేసినట్లు కనుగొన్నాము. అంటే ఈ వీడియో అగస్టు చివరి వారంలో వచ్చిన విజయవాడ వరదల కంటే ముందు నుండే ఇంటర్నెట్లో ఉంది. దీన్ని బట్టి ఈ వీడియో ఇటీవల విజయవాడలో వచ్చిన దృశ్యాలను చూపించడం లేదని మనం నిర్ధారించవచ్చు. అలాగే ఈ ఫేస్‌బుక్‌ వీడియో యొక్క వివరణ ప్రకారం, వైరల్ వీడియోలోని దృశ్యాలు పాకిస్తాన్ కరాచీలోని కర్లీ సరస్సుకు సంబంధించినవి (ఉర్దూలో నుండి తెలుగులోకి అనువదించగా). ఇదే వీడియోను షేర్ చేస్తూ ఈ వీడియో కర్లీ సరస్సుకు సంబంధించినది అని చెప్తున్న ఇతర పోస్టుల ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.   

ఈ సమాచారం ఆధారంగా ఈ వైరల్ వీడియో కరాచీలోని కర్లీ సరస్సుకు సంబంధించినదా? కాదా ?అని ధృవీకరించడం కొరకు, మేము యూట్యూబ్‌లో కర్లీ సరస్సుకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం వెతకగా పలు వీడియోలు లభించాయి లభించాయి (ఇక్కడ, ఇక్కడ). పాకిస్థాన్‌కి చెందిన GNN వార్తా ఛానెల్ ఫేస్‌బుక్‌ పేజీలో కూడా ఈ ‘కీంజర్ సరస్సు లేదా కర్లీ సరస్సుకు ‘ యొక్క వీడియో లభించింది. ఈ వీడియోలలో మనం వైరల్ వీడియోలో మాదిరిగానే సరస్సులో పెద్ద ట్యూబ్ లపై వ్యక్తులు తేలియాడం, అలాగే సరస్సు ఒడ్డున అనేక టెంట్ హౌస్‌లు మనం చూడవచ్చు. ఈ వీడియోలలోని దృశ్యాలను వైరల్ వీడియోలోని దృశ్యాలతో పోల్చి చూడగా, వైరల్ వీడియోలోని దృశ్యాలు పాకిస్థాన్ కరాచీలోని కర్లీ సరస్సుకు సంబంధించినవి మనం నిర్ధారించవచ్చు. ఈ ‘కీంజర్ సరస్సు లేదా కర్లీ సరస్సుకు’ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని తట్టా జిల్లాలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారక ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్, ఈ వైరల్ పోస్టుపై స్పందిస్తూ వైరల్ పోస్టులో పేర్కొన్న విషయాలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. బుడమేరు నదికి గేట్లు లేవని, గట్టు భద్రత కోసం లేదా నిరోధించడానికి గేట్లు తెరిచారనే వాదనలను ఖండిస్తూ పోస్ట్ స్పష్టం చేసింది. బుడమేరు కృష్ణా నదికి ఆనుకుని ఉండగా, మరో వైపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉందని ఈ  పోస్ట్‌ పేర్కొంది.

చివరగా, ఇటీవల విజయవాడలో వచ్చిన వరదలకు సంబంధించిన దృశ్యాలుగా పేర్కొంటూ సంబంధం లేని పాకిస్థాన్‌కు చెందిన వీడియోను షేర్ చేస్తున్నారు.