అమృత్‌సర్ హెరిటేజ్ స్ట్రీట్‌లో గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉన్న డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని ఓ వ్యక్తి 26 జనవరి 2025న ధ్వంసం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటనలో నిందితుడిని కోర్టులో లాయర్లు కొట్టారని చెబుతూ ఓ వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అమృత్‌సర్‌లో డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించిన నిందితుడిపై కోర్టులో లాయర్లు దాడి చేసిన వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోకు అమృత్‌సర్‌లో 26 జనవరి 2025న డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేసేందుకు యత్నించిన సంఘటనతో ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియో రాయపూర్ కోర్టు ప్రాంగణంలో లాయర్లు ఒక నిందితుడిని కొట్టిన దృశ్యాలను చూపిస్తుంది. 16 జనవరి 2025న రాయపూర్‌లో అజయ్ సింగ్ అనే యువకుడు లాయర్లపై దాడి చేసినందుకు FIR నమోదు అయ్యింది. 17 జనవరి 2025న, నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్లినప్పుడు, అతడిపై దాడి జరిగింది. ఈ ఘటన తర్వాత, అజయ్ సింగ్ పై దాడి చేసిన లాయర్లపై కూడా FIR నమోదు అయింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
26 జనవరి 2025న జరిగిన సంఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికితే పలు వార్త కథనాలు (ఇక్కడ, & ఇక్కడ) (ఆర్కైవ్ లింక్ ఇక్కడ, & ఇక్కడ) లభించాయి. ఈ వార్త కథనాల ప్రకారం, 26 జనవరి 2025న అమృత్‌సర్‌లోని హెరిటేజ్ స్ట్రీట్‌లో గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉన్న డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆకాశ్‌దీప్ సింగ్ అనే వ్యక్తి ధ్వంసం చేసేందుకు యత్నించాడు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విగ్రహానికి పూలమాలలు వేసేందుకు అక్కడ ఉంచిన నిచ్చెనపై ఆయన ఎక్కాడు. అయితే, అతని దగ్గర సుత్తి ఉండటాన్ని గమనించిన పర్యాటక శాఖ సెక్యూరిటీ స్టాఫ్ వెంటనే అతడిని పట్టుకుని కోత్వాలి(Division E) పోలీసులకు అప్పగించారు. కోత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ హర్సందీప్ సింగ్ ప్రకారం, నిందితుడిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసారు.
ఈ కేసుకు సంబంధించిన FIR కాపీని కూడా మేము కనుగొన్నాము.
కోర్టులో లాయర్లు ఒక వ్యక్తిని కొడుతున్న వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీ ఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ ‘దైనిక్ భాస్కర్’ ప్రచురించిన వార్తా కథనం ఒకటి (ఆర్కైవ్ లింక్) లభించింది. ఈ కథనం ద్వారా, వైరల్ వీడియో రాయ్‌పూర్ కోర్టులో లాయర్లు ఒక నిందితుడిని కొట్టిన ఘటనకు సంబంధించింది అని, అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటనతో ఈ వీడియోకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం అయ్యింది.
వైరల్ వీడియో, దైనిక భాస్కర్ వార్తా కథనం మధ్య అనేక సారూప్యతలు గుర్తించాం. ఈ సమానతలను క్రింద చూడవచ్చు.
ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికితే పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) (ఆర్కైవ్ లింక్ ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) లభించాయి. ఈ కథనాలు ప్రకారం, రాయ్‌పూర్ కోర్టు ప్రాంగణంలో అజయ్ సింగ్ అనే యువకుడిని లాయర్లు కొట్టారు, ఆ యువకుడు లాయర్లపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల ప్రకారం, ఆరోపణలు ఎదుర్కొంటున్న అజయ్ సింగ్ 16 జనవరి 2025న సీనియర్ లాయర్ దిర్గేష్ శర్మపై దాడి చేశాడు. బాధిత లాయర్ ఫిర్యాదు మేరకు ఖమ్తరై పోలీసులు FIR నమోదు చేసి, యువకుడిని అరెస్టు చేశారు. తర్వాత, 17 జనవరి 2025న, నిందితుడిని కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు తీసుకెళ్లిన సమయంలో, అతడిపై పోలీసు కస్టడీలోనే దాడి జరిగింది.
ఈ కేసుకు సంబంధించిన FIR కాపీని మేము కనుగొన్నాము. FIR కాపీ ప్రకారం, 16 జనవరి 2025న ఉదయం, మనోజ్ కుమార్ సింగ్, దిర్గేష్ కుమార్ శర్మ రాయ్‌పూర్ శివానంద్ నగరంలోని నర్మదేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉన్నప్పుడు, మనోజ్ బావమరిది అజయ్ సింగ్ అక్కడ వచ్చి పాత కక్షలతో దాడి చేసి గాయపరిచాడు.
రాయ్‌పూర్ కోర్టు ప్రాంగణంలో అజయ్ సింగ్‌ను లాయర్లు కొట్టిన ఘటన తర్వాత, ఆ లాయర్లపై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో FIR కూడా నమోదు చేయబడింది.
చివరిగా, అమృతసర్‌లో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించిన వ్యక్తిని లాయర్లు కొట్టారంటూ సంబంధంలేని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వీడియోను షేర్ చేస్తున్నారు.