17 నవంబర్ 2025న సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు ఒక డీజిల్ ట్యాంకర్‌ను డీ కొట్టిన రోడ్డు ప్రమాదంలో సుమారు 45 మంది యాత్రికులు మరణించారు. వార్తా కథనాల (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ప్రకారం ఈ దుర్ఘటనలో మరణించిన వారందరూ హైదరాబాద్ వాసులే. వీళ్లలో 18 మంది ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ బస్సు ప్రమాదానికి చెందిన దృశ్యాలని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: 17 నవంబర్ 2025న సౌదీ అరేబియాలోని మదీనా దగ్గర జరిగిన ఉమ్రా యాత్రికుల బస్సు ప్రమాదం యొక్క వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో, ఈ బస్సు ప్రమాదానికి చెందినది కాదు. 2017లో సౌదీ అరేబియాలోని అభాలో జరిగిన ఒక ట్యాంకర్ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇది. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాల కోసం, అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసాము. ఈ సెర్చ్ ద్వారా ఈ వీడియోకు చెందిన 2017 నాటి వార్తా కథనాలు, యూట్యూబ్ వీడియోలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).
ఈ కథనాల ప్రకారం, సౌదీ అరేబియాలోని అభాలో ఉన్న ఆసిర్ అనే ప్రదేశంలో 32 టన్నుల డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్రైవర్ మరణించాడు.
ఇక 27 నవంబర్ 2025న సౌదీలో జరిగిన ఉమ్రా యాత్రికుల బస్సు ప్రమాదం యొక్క దృశ్యాలను మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి, వాటిని మీరు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
చివరగా, సౌదీ అరేబియాలో 17 నవంబర్ 2025న జరిగిన ఉమ్రా యాత్రికుల బస్సు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ అని చెప్తూ 2017 నాటి సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు.