12 ఆగష్టు 2025న ఆంధ్రప్రదేశ్‌లోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు పోలింగ్ జరిగింది. 14 ఆగష్టు 2025న వెల్లడించిన ఫలితాలలో ఈ రెండు స్థానాలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో, ఈ ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించి అనేక సార్లు ఓట్లు చేయడం చూడవచ్చు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ఆగష్టు 2025లో జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో రిగ్గింగ్ చేస్తున్నప్పటి వీడియో.
ఫాక్ట్: వైరల్ వీడియో కనీసం జూలై 2023 నుంచి ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. అయితే, పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఆగష్టు 2025లో జరిగాయి. కావున, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో కనీసం జూలై 2023 నుంచి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నట్లు గుర్తించాం.
ఈ వీడియో జూలై 2023లో జరిగిన పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినదిగా ఆ సమయంలో పలువురు యూజర్లు పోస్టు (ఇక్కడ & ఇక్కడ) చేశారు.
ఈ వీడియో గురించి కచ్చితమైన వివరాలు మేము ధృవీకరించలేనప్పటికీ, ఈ వీడియో ఆగష్టు 2025లో జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు కనీసం రెండేళ్ల ముందు నుంచే ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫాక్ట్- చెక్ విభాగం కూడా ఈ వీడియో ఆగష్టు 2025లో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించినది కాదని, ఇలాంటి దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
చివరిగా, ఆంధ్రప్రదేశ్ జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందంటూ సంబంధంలేని పాత వీడియోని షేర్ చేస్తున్నారు.