వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024 పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) నివేదికను ప్రతిపక్షాల నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం 13 ఫిబ్రవరి 2025న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు మేధా విశ్రామ్ కులకర్ణి, లోకసభలో ఎంపీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్ జగదాంబికా పాల్ నివేదికను ప్రవేశపెట్టారు. 19 ఫిబ్రవరి 2025న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024కు చేసిన సవరణలను ఆమోదించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు పలు వార్త కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలో “వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024 పార్లమెంటులో ఆమోదం పొందబోతున్నందున, భారతదేశంలో తీవ్రమైన అల్లర్లు జరిగే అవకాశం ఉంది, కాబట్టి ప్రజలు, ముఖ్యంగా హిందువులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరించారు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ పోస్ట్‌కు మద్దతుగా, ప్రధానమంత్రి మోదీ భారతదేశంలోని సనాతన వాదులు (హిందువులు) అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న వీడియోను జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024 పార్లమెంటులో ఆమోదం పొందబోతున్నందున, భారతదేశంలో తీవ్రమైన అల్లర్లు జరిగే అవకాశం ఉంది కావున హిందువులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరిస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): వక్ఫ్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందబోతున్నందున, దేశంలో తీవ్రమైన అల్లర్లు జరిగే అవకాశం ఉందని ప్రధానమంత్రి మోదీ భారత ప్రజలను హెచ్చరించలేదు. ఈ వైరల్ వీడియో 14 సెప్టెంబర్ 2023న మధ్యప్రదేశ్‌లోని బినాలో జరిగిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని చూపిస్తుంది. నిజానికి, ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రధాని మోదీ INDI కూటమిని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ఈ వైరల్ వీడియోలో చూపించబడ్డాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా, పార్లమెంటులో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందబోతున్నందున తీవ్రమైన అల్లర్లు జరిగే అవకాశం ఉందని ప్రధాని మోదీ భారతదేశ ప్రజలను హెచ్చరించారా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ క్లెయింను సమర్థించే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు. ఒకవేళ ప్రధాని మోదీ ఇలాంటి చేసి వ్యాఖ్యలు చేసి ఉంటే, కచ్చితంగా పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి.
ఇకపోతే ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగిన అధిక నిడివి గల వీడియోను భారత పార్లమెంట్ అధికారిక యూట్యూబ్ ఛానల్ ‘సంసద్ టీవీ (Sansad TV)’, 14 సెప్టెంబర్ 2023న “మధ్యప్రదేశ్‌లోని బినాలో జరిగిన అభివృద్ధి పనుల కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు” (ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువదించగా) అనే శీర్షికతో షేర్ చేసినట్లు కనుగొన్నాము.
వైరల్ వీడియోలో కనిపించే దృశ్యాలు ఈ వీడియోలో టైమ్‌స్టాంప్ 24:44 వద్ద ప్రారంభమై టైమ్‌స్టాంప్ 25:14 వద్ద ముగుస్తాయి. ఈ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఈ INDI కూటమి మన సనాతన విలువలను కూల్చాలని చూస్తోంది. నేడు, ఈ వ్యక్తులు (INDI కూటమి) బహిరంగంగా మాట్లాడటం ప్రారంభించారు, వారు (INDI కూటమి) మన సనాతన విలువలపై బహిరంగ దాడిని ప్రారంభించారు. భవిష్యత్తులో, వారు (INDI కూటమి) మనపై దాడులను పెంచుతారు. ప్రతి సనాతన వ్యక్తి, ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ, ఈ నేలను పూజించే ప్రతి ఒక్కరూ మరియు ఈ దేశాన్ని ప్రేమించే లెక్కలేనన్ని మంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారు (INDI కూటమి) సనాతనాన్ని నిర్మూలించి, ఈ దేశాన్ని మరో వెయ్యి సంవత్సరాల బానిసత్వంలోకి నెట్టాలని కోరుకుంటున్నారు. కానీ మనం కలిసి, ఈ శక్తులను (INDI కూటమి) ఆపాలి, మన బలం, మన ఐక్యతతో వారి (INDI కూటమి) ప్రణాళికలను అడ్డుకోవాలి”అని పేర్కొన్నారు. వాస్తవంగా, ఈ సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీ INDI కూటమిని లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం యొక్క ఆంగ్ల అనువాద కాపీని ఇక్కడ చూడవచ్చు.
వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024:
08 ఆగస్టు 2024న, వక్ఫ్ బోర్డు పనితీరును క్రమబద్ధీకరించడం మరియు వక్ఫ్ యొక్క సమర్థ నిర్వహణ లక్ష్యంతో లోక్‌సభలో Waqf (Amendment) Bill, 2024, and the Mussalman Waqf (Repeal) Bill, 2024, అనే రెండు బిల్లులు ప్రవేశపెట్టబడ్డాయి. పార్లమెంటులో ఈ బిల్లులపై విస్తృత చర్చ జరిగిన తర్వాత, ఈ బిల్లులను అధ్యయనం మరియు సిఫార్సుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపారు (ఇక్కడ, ఇక్కడ). వక్ఫ్ బిల్లులపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను 30 జనవరి 2025న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. వక్ఫ్ బిల్లులపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.
చివరగా, వక్ఫ్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందబోతున్నందున, తీవ్రమైన అల్లర్లు జరిగే అవకాశం ఉందని ప్రధానమంత్రి మోదీ భారత ప్రజలను హెచ్చరించలేదు.