2015 వీడియోని గుజరాత్‌లో ఇటీవల రాఖీ పండగ నాడు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముస్లింలను పోలీసులు చితకబాదుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

గుజరాత్‌ రాష్ట్రంలో ఇటీవల రాఖీ పండగ నాడు రోడ్డుపై వెళ్తున్న మహిళలను అల్లరి చేస్తూ వారితో అసభ్యంగా ప్రవర్తించిన ముస్లిం యువకులను పోలీసులు చితకబాదుతున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: గుజరాత్‌లో ఇటీవల రాఖీ పండగ నాడు రోడ్డుపై వెళ్తున్న ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించిన  ముస్లిం యువకులను పోలీసులు చితకబాదుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): 2015లో గుజరాత్‌ రాష్ట్రం సూరత్ నగరంలో చోటుచేసుకున్న ఘటనను ఈ వీడియో చూపిస్తుంది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ నదీమ్, ఖాదీమ్ అనే యువకులను సూరత్ పోలీసులు లాఠీలతో చితకబాదిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఇండియా టుడే వార్తా సంస్థ 2015 డిసెంబర్ నెలలో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ గుజరాత్ పోలీసులు ఇద్దరు యువకులను లాఠీలతో చితకబాదిన దృశ్యాలంటూ ఈ వీడియోని షేర్ చేస్తూ రిపోర్ట్ చేశారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరంలో చోటుచేసుకుందని ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

ABP వార్తా సంస్థ ఈ ఘటనకు సంబంధించి పబ్లిష్ చేసిన వీడియోలో, సూరత్ నగరంలో నదీమ్, ఖాదీమ్ అనే యువకులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అనేక వాహనాలను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ పోలీసులు వారిని నగర వీధిలో లాఠీలతో కొట్టినట్టు రిపోర్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని వార్తా సంస్థలు కూడా 2015లో రిపోర్ట్ చేశాయి. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసీన వీడియో పాతది అని, ఇటీవల రాఖీ పండగ నాడు చోటుచేసుకున్న ఘటన కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, 2015 వీడియోని గుజరాత్ రాష్ట్రంలో రాఖీ పండగ నాడు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముస్లింలను పోలీసులు చితకబాదుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.