22 ఏప్రిల్ 2025న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. కాకపోతే, 25 ఏప్రిల్ 2025న తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసిన కొత్త ప్రకటనలో, TRF పహల్గామ్ సంఘటనలో తమ ప్రమేయం లేదని, అంతకు ముందు చేసిన ప్రకటనతో తమకు సంబంధం లేదని తెలిపింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ్డారు. మతం అడిగిన తర్వాత ఉగ్రవాదులు పురుషులను లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపారని బాధితులు చెప్పినట్లు పలు మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ). రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు (ఇక్కడ, ఇక్కడ).
పహల్గామ్ దాడి తర్వాత, తీవ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోందని భావించిన భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై పలు ఆంక్షలు విధించింది. భారతదేశం 1960 సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది, పాకిస్తాన్ సైనిక సలహాదారులను న్యూఢిల్లీ నుండి బహిష్కరించింది, ఇస్లామాబాద్ నుండి తన సొంత సైనిక సలహాదారులను ఉపసంహరించుకుంది. భారత ప్రభుత్వం అన్ని పాకిస్థాన్ సరిహద్దు క్రాసింగ్‌లను మూసివేసింది. పాకిస్తాన్ పౌరులకు వీసాలపై ఆంక్షలను విధించింది, వారిని 48 గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అలాగే, భారత పౌరులను వెంటనే పాకిస్తాన్ నుండి తిరిగి రావాలని సూచించింది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ నుండి పాక్ సైనిక, నావికాదళ, వైమానిక సలహాదారులను కూడా భారత్ బహిష్కరించింది. దీనికి ప్రతిస్పందిస్తూ, పాకిస్తాన్ భారతదేశంతో వాణిజ్యాన్ని నిలిపివేసింది. భారత విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది. భారత దౌత్యవేత్తలను బహిష్కరించింది. పాకిస్తాన్ దళాలు జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రదేశాలలో కాల్పులు జరిపినట్లు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. అలాగే, పహల్గామ్ దాడి తర్వాత భారత సైన్యం జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలన కార్యకలాపాలను ప్రారంభించింది, ఈ ఆపరేషన్లలో భాగంగా కుల్గాం, బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితిని సమీక్షించడానికి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది 25 ఏప్రిల్ 2025న కాశ్మీర్‌ను సందర్శించారు .
ఈ నేపథ్యంలో, భారత సైన్యం జై భవాని, జై శివాజీ నినాదాలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ, “పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల దృశ్యాలు” అని పేర్కొంటున్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 22 ఏప్రిల్ 2025న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్లలో భాగంగా భారత సైన్యం “జై భవానీ, జై శివాజీ” అని నినాదాలు చేస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోకు 22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియో అక్టోబర్ 2024 నుండి ఆన్ లైన్లో ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అక్టోబర్ 2024లో పోస్ట్ చేయబడిన ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో ఇదే వీడియో యొక్క చిన్న వెర్షన్‌ను కనుగొన్నాము. ఈ వీడియో యొక్క శీర్షికలో ఇది ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో CRPF కోబ్రాస్, STF నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో 30 మంది నక్సలైట్లు హతమయ్యారని పేర్కొంది. దీన్ని బట్టి ఈ వీడియో పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందు నాటిదని మనం నిర్ధారించవచ్చు.
దీన్ని ఆధారంగా, ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, అక్టోబర్ 2024లో ప్రచురించబడిన పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాలు ప్రకారం, 04 అక్టోబర్ 2024న, ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-నారాయణ్‌పూర్ సరిహద్దులోని అబుజ్‌మద్ అడవులలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 38 మంది నక్సలైట్లు మరణించారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో సంయుక్త DRG-STF బృందం పని చేసి పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.
అయితే మేము ఈ వైరల్ వీడియో ఎప్పడు, ఎక్కడ రికార్డు చేశారనే విషయాన్ని కచ్చితంగా ధృవీకరించలేము. కానీ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ వీడియో పహల్గామ్ దాడికి ముందు నుండే ఆన్ లైన్లో ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
చివరిగా, జై భవానీ, జై శివాజీ అని నినాదాలు చేస్తున్న భారత సైన్యం పాత వీడియోను పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఉగ్రవాద నిర్మూలన చర్యల దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.