సోషల్ మీడియాలో ఒక వృద్ధ వ్యక్తి భగవంతుని చిత్రపఠాలను ఒక ఎర్రటి గుడ్డలో నుంచి తీసి ఒక గోడకి ఆనిస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) ఒకటి వైరల్ అవుతోంది. ఈయన వయసు 154 ఏళ్లు అని, మహా కుంభమేళాలో పాల్గొనడానికి ఈయన హిమాలయ పర్వతాల నుంచి వచ్చిన ఒక సన్యాసి అని క్లెయిమ్ చేస్తూ నెటిజన్లు షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: మహా కుంభమేళాలో పాల్గొన్న ఒక 154 సంవత్సరాల సన్యాసి వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో పాతది, 2025 కుంభమేళాలో తీసింది కాదు. ఇందులో ఉన్న వ్యక్తి పేరు సంత్ సియారామ్ బాబా. ఈయన మధ్య ప్రదేశ్‌లోని భట్టయాన్ భుజుర్గ్‌లోని తన ఆశ్రమంలో 2024 డిసెంబర్ నెలలో చనిపోయారు. వార్తా కథనాల ప్రకారం, చనిపోయే నాటికి ఆయన వయసు 94 నుంచి 110 సంవత్సరాలు (కచ్చితమైన వయసు ఎవరికీ తెలియదు). కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, అందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చెక్ చేయగా, మాకు ఇదే వీడియో ఉన్న డిసెంబర్ 2024 నాటి ఒక ‘X’ పోస్ట్ దొరికింది. ఇందులో కనిపిస్తున్న వ్యక్తి పేరు సియారామ్ బాబా అని, ఈయన ‘ఈరోజు,’ అనగా 11 డిసెంబర్ 2024న మరణించారు అని ఈ పోస్ట్ యొక్క వివరణలో ఉంది.
దీన్ని వెరిఫై చేయడానికి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, సంత్ సియారామ్ బాబా 11 డిసెంబర్ 2024న మరణించారు అని చెప్తూ మాకు అనేక వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).
ఇదే ప్రక్రియలో మాకు వైరల్ వీడియో యొక్క అసలు వెర్షన్ కూడా లభించింది. వికెన్ కుష్వా అనే వ్యక్తి ఈ వీడియోని 11 అక్టోబర్ 2024న ఇన్స్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు(ఆర్కైవ్ లింక్). దీనిబట్టి ఈ వీడియో పోయిన ఏడాది(2024) నుండి ఇంటర్నెట్లో ఉంది అని, ఇప్పుడు 2025 కుంభమేళాలో తీసింది కాదు అని మనకి అర్థం అవుతుంది.
వికెన్ కుష్వా ప్రొఫైల్‌లో సియారామ్ బాబా యొక్క అనేక వీడియోలు ఉన్నాయి. అలాగే సియారామ్ బాబా యొక్క ఫేస్‌బుక్ పేజీలో కూడా మాకు ఆయన పూజలు చేస్తున్న అనేక వీడియోలు(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) దొరికాయి. ఆయన మరణం గురించి సమాచారం కూడా ఈ పేజీలో అప్లోడ్ చేశారు(ఇక్కడ ,ఇక్కడ మరియు ఇక్కడ)
వార్తా కథనాల ప్రకారం , సంత్ సియారామ్ బాబా 11 డిసెంబర్ 2024న మోక్ష ఏకాదశి నాడు మరణించారు. ఆయన హనుమంతుని భక్తుడు. ఈయన మధ్య ప్రదేశ్‌లోని భట్టయాన్ భుజుర్గ్‌లో నర్మదా నది తీరాన తన ఆశ్రమంలో ఉండేవారు. వైరల్ పోస్టులో చెప్తున్నట్టుగా ఆయన వయసు 154 సంవత్సరాలు అని ఒక్క వార్తా కథనంలో కూడా పేర్కొనలేదు. ఈ కథనాల ప్రకారం, చనిపోయే నాటికి ఆయన వయసు 94 నుంచి 110 సంవత్సరాల మధ్యలో ఉంటుంది (ఇక్కడ,ఇక్కడ మరియు ఇక్కడ).
అదనంగా, ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకి, హిమాలయాల నుండి 154 సంవత్సరాల వృద్ధ సాధువు వచ్చారా అని ఏమైనా వార్త కథనాలు ఉన్నాయా అని చూడగా, మాకు ఎటువంటి విశ్వసనీయ కథనాలు దొరకలేదు. కానీ 129 ఏళ్ల స్వామి శివానంద గురించి మాకు తెలిసింది (ఇక్కడ మరియు ఇక్కడ). ఆయన ఆధార్ కార్డు ప్రకారం అతను 8 ఆగస్టు 1986లో జన్మించారు.
చివరగా, మహా కుంభమేళాలో పాల్గొనేందుకు హిమాలయ పర్వతాల నుంచి 154 ఏళ్ల సన్యాసి వీడియో అని సంత్ సియారామ్ బాబా పాత వీడియోను షేర్ చేస్తున్నారు.