2016 వీడియోని ‘హిందూస్తాన్ ఖతం కావలి’ అని రాహుల్ గాంధీ ముందు ముస్లింలు శపథం చేస్తునట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు

హిందూస్తాన్ ఖతం కావాలి, ముస్లిం రాజ్యం మళ్ళి రావాలంటూ ముస్లింలు శపథం చేస్తుంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పక్కనే నిలబడి వింటున్న దృశ్యాలు, అని షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హిందూ రాజ్యం పోవాలి, మళ్లీ ముస్లిం రాజ్యం కావాలి, అప్పటి వరకు నిద్రపోవద్దని ముస్లింలు శపథం చేస్తుంటే ముస్లిం టోపీ తలపై ధరించిన రాహుల్ గాంధీ, తన పక్కన ఉన్న గులాం నబీ ఆజాద్ నిలబడి వింటున్నారని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హిందువులకి, హిందూమతానికి కి వ్యతిరేకంగా ముస్లింలు శపథం చేస్తుంటే రాహుల్ గాంధీ పక్కనే నిలబడి వింటున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): 2016లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లోని కిచౌచ షరీఫ్ దర్గాను సందర్శించినప్పుడు తీసిన వీడియో ఇది. ఈ వీడియోలో ప్రార్ధన చేస్తున్న ముస్లిం వ్యక్తి భారతదేశంలోని ప్రజలు శాంతియుతంగా జీవించాలని దేవుడిని కోరుకున్నారు. హిందువులకి, హిందూ మతానికి  వ్యతిరేకంగా ఎటువంటి శపథం చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Samay Live’ ఛానల్ ‘10 సెప్టెంబర్ 2016’ నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ‘Rahul Gandhi visit to Kichaucha Sharif Durgah in Ambedkar Nagar’ అనే టైటిల్ తో ఈ వీడియోని యూట్యూబ్ లో పోస్ట్ చేసారు. రాహుల్ గాంధీ ఈ దర్గాను సందర్శించడానికి సంబంధించి పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ న్యూస్ ఆర్టికల్స్ లో ఎక్కడ కూడా హిందువులకి, హిందూమతానికి వ్యతిరేకంగా ముస్లింలు ప్రార్ధన చేసినట్టు తెలుపలేదు. రాహుల్ గాంధీ సమక్షంలో ముస్లింలు అటువంటి శపధాలు ఒకవేళ చేసివుంటే, మీడియా సంస్థలు తప్పకుండా రిపోర్ట్ చేసేవి.

పోస్ట్ లోని వీడియోలోని మాటలు తెలుగులో అనువదించి చూస్తే, ఈ క్రింది అర్థం వస్తుంది. “ఇది మన విధి. అతను వచ్చిన ఉద్దేశ్యం కూడా ఇదే. అతను తన కోసం ధనం కోరుకోడు. అతని చేతులు బలోపేతం చేయండి. ధైర్యమయిన ….. ప్రజలారా …. భూమి ఏడుస్తోంది. ఇది పడుకునే సమయమో, మెలకువతో ఉండే సమయమో, నడిచే సమయమో కాదు, రాత్రింబవళ్ళూ కష్టపడాలి. భారతదేశ విభజన శక్తులను ఓడించాలని ఆయనకు ఒకే ఒక కోరిక ఉంది. వారు మనలోని సోదరభావాన్ని అంతం చేయాలనుకుంటున్నారు. అతను మీలాగే ఈ ప్రదేశానికి శాంతి సందేశాన్ని తీసుకువొచ్చాడు. ఇదే శాంతి సందేశాన్ని అతను ఈ భూమికి మరియు హిందుస్తాన్ కి తీసుకురావాలని కోరుకుంటాడు. అతన్ని బలోపేతం చేసి, విభజన శక్తులను ఓడించి మరో గాంధీకి జన్మనివ్వడానికి ధైర్యం ఇవ్వండి”. ఈ వీడియోలో ప్రార్దన చేస్తున్న ముస్లిం వ్యక్తి హిందూస్తాన్ లో శాంతి నెలకొల్పమని దేవుడిని కోరుకున్నారు. హిందూమతానికి వ్యతిరేకంగా కాని, ముస్లిం రాజ్యం కావాలని గాని ఆ ముస్లిం వ్యక్తి ప్రార్ధించలేదు.

చివరగా, 2016లో రాహుల్ గాంధీ ఒక దర్గాని సందర్శించినప్పుడు తీసిన వీడియోని హిందూ మతానికి వ్యతిరేకంగా ముస్లింలు రాహుల్ గాంధీ ముందు శపధాలు చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు.