2020లో కలకత్తాలోని హౌరాలో కొందరు వ్యక్తులు పోలీసులపై దాడి చేసిన సంఘటన వీడియోని ఏప్రిల్ 2025లో ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తూ, ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్‌లోని చాలా చోట్ల నిరసనలు జరిగాయి. ముర్షిదాబాద్‌ జిల్లాలో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారి, గొడవలు, అల్లర్లు కూడా జరిగాయని వార్తా కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). వార్త కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన ఈ గొడవల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, ఇందులో చందన్ దాస్, హరగోబింద్ దాస్ అనే ఇద్దరు హిందువులు ఒక మూక దాడిలో మరణించగా, ఒక ముస్లిం వ్యక్తి పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. ముర్షిదాబాద్‌ జిల్లాలో జరుగుతున్న ఈ హింసను తప్పించుకోవడానికి వందలాది హిందువులు తమ ఇళ్లను వదిలి, ఆశ్రయం పొందడానికి మాల్డా నగరానికి చేరుకున్నారు(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).  పరస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర బలగాలని మోహరించాలని కలకత్తా హైకోర్టు  ఆదేశించింది (ఇక్కడ, ఇక్కడ). ఈ అల్లర్లకు సంబంధించి సుమారు 150 పైగా వ్యక్తులు అరెస్ట్ అయ్యారు (ఇక్కడ, ఇక్కడ). 

ఈ నేపథ్యంలో, యూనిఫామ్ ధరించి ఉన్న భద్రతా దళ అధికారులను కొందరు వ్యక్తులు దాడి చేస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భద్రతా దళాలకే పశ్చిమ బెంగాల్‌లో భద్రత అవసరం ఏర్పడిందని, ముస్లింలు వీరిపై ఈ విధంగా దాడి చేశారు అని క్లెయిమ్ చేస్తూ ఈ వీడియోని యూజర్లు షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.  

క్లెయిమ్: ఏప్రిల్ 2025 ముర్షిదాబాద్‌ అల్లర్ల నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్‌లో భద్రతా దళాలపై కొందరు ముస్లింలు దాడి చేస్తున్న వీడియో.

ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో 2020 నాటిది. కోవిడ్-19 లాక్‌డౌన్ సందర్భంలో పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో లాక్‌డౌన్ అమలు చేస్తున్న పోలీసు అధికారులపై కొందరు ఈ విధంగా దాడి చేశారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది. 

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి వైరల్ వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఈ సంఘటనపై ఏప్రిల్ 2020లో ప్రచురితమైన కొన్ని వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి.

ఈ కథనాల ప్రకారం, ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ హౌరాలో ఉన్న టికియాపరా అనే ప్రాంతంలో 28 ఏప్రిల్ 2020న జరిగింది. కరోనావైరస్ (కోవిడ్-19) లాక్డౌన్ అమలు చేయడానికి హౌరాలోని రెడ్ జోన్‌లో ఉన్న టికియాపరాకి వెళ్లిన పోలీసు వారిపై కొందరు రాళ్లు రువ్వి, దాడి చేశారు. దీని కారణంగా ఇద్దరు పోలీస్ అధికారులు గాయాలపాలయ్యారు.

దాడి చేసిన వారపై పోలీసు వారు అప్పట్లో కేసు కూడా నమోదు చేశారు. ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అని, ఈ విధంగా అసలు జరగకుండా ఉండాల్సింది అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంపై స్పందిస్తూ అన్నారని వార్తా కథనాలు పేర్కొన్నాయి.

చివరగా, 2020లో కలకత్తాలోని హౌరాలో కొందరు వ్యక్తులు పోలీసులపై దాడి చేసిన సంఘటన వీడియోని ఏప్రిల్ 2025లో ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు