22 ఏప్రిల్ 2025న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి కారణంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, ‘పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ.. చైనా కవ్వింపు చర్యలు, హిమాలయాల వద్ద లైవ్-ఫైర్ విన్యాసాలు నిర్వహించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ అని చెప్తూ మిలిటరీ టాంకర్లు భారీ ఎత్తున కాల్పులు జరుపుతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత హిమాలయాల వద్ద, చైనా యుద్ధ విన్యాసాలు చేస్తున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో 22 ఏప్రిల్ 2025న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి కంటే ముందు నుంచే ఇంటర్నెట్లో ఉంది. చైనా మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాల ప్రకారం చైనీస్ సైన్యం నిర్వహించిన ఒక ‘కంబాట్ షూటింగ్ అసెస్మెంట్’ను ఈ వీడియో చూపిస్తుంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో తెలుసుకోవడానికి వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతుకగా, ఈ వీడియో షేర్ చేసిన కొన్ని చైనా దేశ వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. ‘Flamingwheelsmedia’ అనే సంస్థ కూడా ఈ వీడియోని 12 ఏప్రిల్ 2025న ఇన్స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసింది. దీనిబట్టి, ఈ వీడియోకి 22 ఏప్రిల్ 2025న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకి ఎటువంటి సంబంధం లేదు అని మనకి అర్థం అవుతుంది.
‘Xinhuanet’ అనే సంస్థ ఈ వీడియోపై ప్రచురించిన ఒక వార్తా కథనంలో, ఈ దృశ్యాలు చైనా దేశపు సైన్యం నిర్వహించిన ఒక మల్టీ-సబ్జెక్ట్, మల్టీ-అమ్యూనిషన్, మల్టీ-ఫైర్ఆర్మ్ కాంబాట్ షూటింగ్ అసెస్మెంట్‌ను చూపిస్తున్నాయి అని పేర్కొంది. అయితే, అసెస్మెంట్ జరిగిన ప్రదేశం గురించి మాత్రం ఈ కథనాల్లో ఎటువంటి సమాచారం లేదు.
చివరగా, ఈ వీడియోని తీసిన ప్రదేశాన్ని మేము కనుగొనలేకపోయినా, 22 ఏప్రిల్ 2025 పహల్గాం ఉగ్రవాద కంటే ముందు నుంచే ఇది ఇంటర్నెట్లో ఉంది కాబట్టి, పహల్గాం దాడి తర్వాత హిమాలయాల వద్ద చైనా చేపట్టిన సైనిక విన్యాసాలను ఇది చూపిస్తుందనే వాదన సరైనది కాదు.