‘స్త్రీ శక్తి’ పథకం అమలులో ఉన్నప్పటికీ ఏపీలో విద్యార్థినులను ఎక్కించుకోకుండా ఆర్టీసీ బస్సు వెళ్లిపోతుందంటూ పాత వీడియోని షేర్ చేస్తున్నారు

15 ఆగష్టు 2025న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మహిళలు, ట్రాన్స్ జెండర్లు రాష్ట్రవ్యాప్తంగా పలు రకాల APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఈ నేపథ్యంలో, ఈ పథకం అమలులో ఉన్నప్పటికీ, ఏలూరులో ఒక ఆర్టీసీ బస్సు విద్యార్థినులను ఎక్కించుకోకుండా వెళ్లిపోతుందంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. 

ఇదే పోస్టుని ఇక్కడ చూడవచ్చు 

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్‌లో ‘స్త్రీ శక్తి’ పథకం అమలులో ఉన్నప్పటికీ విద్యార్థినులను ఎక్కించుకోకుండా వెళ్లిపోతున్న ఆర్టీసీ బస్సు. 

ఫాక్ట్: ‘స్త్రీ శక్తి’ పథకం 15 ఆగష్టు 2025 నుంచి అమలు చేయగా, ఈ వీడియో కనీసం 25 జూలై 2025 నుంచి ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. ఏలూరు జిల్లాలోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఆర్టీసీ బస్సులను ఆపాలని విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోని ట్యాగ్ చేయగా అందుకు అంగీకరిస్తూ ఆర్టీసీ యాజమాన్యం స్థానిక డిపో మేనేజర్లను ఆదేశించింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.  

ముందుగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోని 25 జూలై 2025న ‘Eluru_official’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. 

ఏలూరు జిల్లా వట్లూరు ప్రాంతంలో ఉన్న సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఆర్టీసీ బస్సులు ఆగకుండా వెళ్లడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఈ పోస్టులో పేర్కొనబడింది. అయితే, ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని  సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద బస్సులకు స్టాపేజ్ ఉండాలని ఆర్టీసీ యాజమాన్యం స్థానిక డిపో మేనేజర్లను ఆదేశించినట్లు 31 జూలై 2025న పేర్కొన్నారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ‘స్త్రీ శక్తి’ పథకం 15 ఆగష్టు 2025 నుంచి అమలులోకీ వచ్చింది. దీన్ని బట్టి, వైరల్ వీడియో ‘స్త్రీ శక్తి’ పథకం అమలు కంటే ముందు నుంచే ఇంటర్నెట్లో అందుబాటులో ఉందని స్పష్టమవుతుంది. 

అదనంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫాక్ట్-చెక్ విభాగం కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. 

చివరిగా, ‘స్త్రీ శక్తి’ పథకం అమలులో ఉన్నప్పటికీ ఏలూరులో విద్యార్థినులను ఎక్కించుకోకుండా ఆర్టీసీ బస్సు వెళ్లిపోతుందని పాత వీడియోని షేర్ చేస్తున్నారు.