టర్కీకి చెందిన ఒక పాత వీడియోను కేరళకు ఆపాదిస్తూ తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు

కేరళలో ఒక పాల ఫ్యాక్టరీని చూడండి ఒక ముస్లిం వ్యక్తి పాల తొట్టెలో స్నానం చేస్తుంటే అదే పాలను ప్యాక్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇంత దారుణమా !!” అని చెప్తూ ఒక ఫ్యాక్టరీలో ఒకతను తొట్టెలో పడుకొని ఒక తెల్లటి ద్రవంతో స్నానం చేస్తున్న వీడియో(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో  ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ వీడియో యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేరళలోని ఒక ముస్లిం వ్యక్తి ,అందరికీ విక్రయించే పాలలో పడుకొని స్నానం చేస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది.

ఫ్యాక్ట్(నిజం): వైరల్ వీడియో టర్కీకి చెందినది, కేరళ కాదు. వార్తా కథనాల ప్రకారం ఈ సంఘటన టర్కీలో 2020లో జరిగింది. ఈ వీడియోలో ఆ వ్యక్తి స్నానం చేస్తున్నది పాలలో కాదు, అది ఒక  క్రిమిసంహారక ద్రవం (disinfectant). కావున, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ వీడియో గురించి మరింత తెలుసుకోవడానికి, అందులోని  కొన్ని కీఫ్రేమ్‌లను ఉపయోగించి Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా, ఈ సంఘటనకి సంబంధించి, టర్కిష్ వార్తా అవుట్‌లెట్ TRT హేబర్, 10 జూన్ 2022న పబ్లిష్ చేసిన వారి ఒక వార్తా కథనం లభించింది

ఈ కథనం ప్రకారం, ఈ సంఘటన టర్కీలోని కొన్యా నగరంలో జరిగింది. కొన్యాలోని డెయిరీ ప్లాంట్‌లో ఎమ్రే సయర్ అనే ఒక ఉద్యోగిని పాలలో స్నానం చేసినందుకు అరెస్టు చేసినట్లు ఈ వార్తా కథనంలో పేర్కొన్నారు. 06 నవంబర్ 2020న ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మరో ప్లాంట్ వర్కర్ ఉగూర్ తుర్గుట్ అనే వ్యక్తిని, ఈ వీడియో వైరల్ అయ్యాక పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సంఘటనకు సంబంధించి అనేక ఇతర వార్తా కథనాలు మీరు ఇక్కడ, క్క మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ కథనాల ప్రకారం, వారు స్నానం చేసిన ద్రవం పాలు కాదు. తాము స్నానం చేసిన ద్రవం ఒక క్రిమిసంహారక ద్రవం అని నిందితులు ఇద్దరు వాదించారు. తర్వాత, కోర్టు వారిద్దరినీ అక్టోబర్ 2021లో నిర్దోషులుగా ప్రకటించింది. 

ఆ తర్వాత ఆ దేశ ఖజానా(treasury and finance ministry) శాఖ నుండి 120,000 టర్కిష్ లిరాలను డిమాండ్ చేస్తూ, ఎమ్రే సయర్ ఒక  నష్ట పరిహార దావా వేసి గెలిచాడు. కొన్యాలోని ఒక కోర్టు అతనికి 1,150 లీరాలు చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆధారాల బట్టి, వైరల్ వీడియో టర్కీకి చెందినదని అని, కేరళలో తీసిన వీడియో కాదు అని మనకి స్పష్టం అవుతుంది.

చివరిగా,  2020లో టర్కీలో జరిగిన ఒక సంఘటన యొక్క వీడియోను కేరళలో జరిగిన సంఘటన అని ఒక తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు.