వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తూ, ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్‌లోని చాలా చోట్ల నిరసనలు జరిగాయి. ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఆందోళనులు హింసాత్మకంగా మారి, గొడవలు, అల్లర్లు కూడా జరిగాయని వార్తా కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). వార్త కథనాల ప్రకారం( ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన ఈ గొడవల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, ఇందులో చందన్ దాస్, హరగోబింద్ దాస్ అనే ఇద్దరు హిందువులు ఒక మూక దాడిలో మరణించగా, ఒక ముస్లిం వ్యక్తి పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. ముర్షిదాబాద్ జిల్లాలో జరుగుతున్న ఈ హింసను తప్పించుకోవడానికి వందలాది హిందువులు తమ ఇళ్లను వదిలి, ఆశ్రయం పొందడానికి మాల్డా నగరానికి చేరుకున్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). పరస్థితిని అదుపులోకి తీసుకురావడానికి జంగిపూర్‌లో కేంద్ర బలగాలని మోహరించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది (ఇక్కడ, ఇక్కడ). ఈ అల్లర్లకు సంబంధించి సుమారు 150 పైగా వ్యక్తులు అరెస్ట్ అయ్యారు (ఇక్కడ, ఇక్కడ).
ఈ నేపథ్యంలో, ఒక పెద్ద బైక్ ర్యాలీని చూపిస్తున్న వీడియోని పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తున్న వారికి ‘చికిత్స’ చేయడానికి బజరంగ్ దళ్ వాళ్లు కలకత్తాకి వెళ్తున్న దృశ్యాలని క్లెయిమ్ చేస్తూ షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: ముర్షిదాబాద్‌లో ఇటీవల (ఏప్రిల్ 2025లో) జరిగిన మతపరమైన హింసాకాండ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌కు వెళ్తున్న బజరంగ్ దళ్ ర్యాలీని ఈ వీడియో చూపిస్తుంది.
ఫ్యాక్ట్(నిజం): ఇది కర్ణాటకలోని చించాలిలో ప్రతి ఏడాది జరిగే మాయక్కా దేవి ఉత్సవానికి సంబంధించిన పాత ర్యాలీ యొక్క వీడియో. ఈ ర్యాలీ మహారాష్ట్రలోని సాంగ్లీ గుండా వెళ్లినప్పుడు ఈ వీడియోని తీశారు. ఈ ర్యాలీకి చెందిన వీడియోలు, ముర్షిదాబాద్ మారణకాండ కంటే ముందు నుంచే అనగా ఫిబ్రవరి 2025 నుంచి ఆన్‌లైన్‌లో ఉన్నాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ముందుగా,వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటరెనెట్లో మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ ద్వారా మాకు ఫిబ్రవరి 2025లో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేయబడిన, వైరల్ వీడియోను పోలిన దృశ్యాలు ఉన్న వీడియోలు దొరికాయి(ఇక్కడ,ఇక్కడ). ‘I.love.shrigonda’ అనే యూజర్ 19 ఫిబ్రవరి 2025న అప్లోడ్ చేసిన వీడియోలో, మరాఠీ భాషలో ఉన్న వివరణను తెలుగులోకి తర్జుమా చేయగా ‘సాంగ్లీలో అర్ధరాత్రి అల్లర్లు సృష్టిస్తున్న యువకులను పోలీసులు కొట్టారు.’ అని ఉంది. సాంగ్లీ మహారాష్ట్రలోని ఒక టౌను పేరు.
17 ఫిబ్రవరి 2025న ‘dnyaneshwar_3116’ అనే యూజర్ వైరల్ క్లిప్పును అప్లోడ్ చేశారు, ఈ వీడియోలో @sumit_suryawanshi_5005 అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడి యొక్క వాటర్‌మార్క్ ఉంది.
సుమిత్ యొక్క పేజిలో వైరల్ వీడియోని పోలిన దృశ్యాలు ఉన్న వీడియో ఒకటి 17 ఫిబ్రవరి 2025న ‘ig_.shreyas_’ అనే యుజర్‌తో కొలాబరేట్ అయ్యి అప్లోడ్ చేయబడింది. ఇందులో వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలతో పాటు అదే మోటార్ సైకిల్ ర్యాలీ యొక్క కొన్ని అదనపు షాట్లు ఉన్నాయి.
వైరల్ వీడియో, లభించిన వీడియోలోని దృశ్యాలను పోల్చి చూస్తే రెండిటిలో కనిపిస్తున్న రోడ్డు లేఅవుట్, సమీపంలోని చెట్లు, దుకాణాలు పోలీస్ వాహనం, కరెంటు పోలుతో సహా చాలా దృశ్యాలు మ్యాచ్ అవుతున్నాయి.
దీనిబట్టి వైరల్ వీడియో శ్రేయాస్ అప్లోడ్ చేసిన వీడియోలో కనిపిస్తున్న ర్యాలీలోకి చెందినది అని మనకు అర్థం అవుతుంది. అలాగే, వైరల్ వీడియోలోని దృశ్యాలు ముర్షిదాబాద్ మారణకాండ కంటే ముందే రికార్డు చేయబడినవి అని మనకు దీనిబట్టి స్పష్టం అవుతుంది.
అసలు ఇది మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగిందా లేదా అనే వివరాల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ‘మహారాష్ట్ర కట్టా 1’ అనే ఛానెల్ అప్‌లోడ్ చేసిన YouTube వీడియో ఒకటి మాకు లభించింది. “సాంగ్లీ బైక్ ర్యాలీ వైరల్ వీడియో: పోలీసులు సాంగ్లీలో అల్లరి మూకలను కొట్టారు!” అనే టైటిల్ ఉన్న ఈ వీడియో 18 ఫిబ్రవరి 2025న అప్లోడ్ చేయబడింది.
ఈ వీడియోలో గుర్రపు స్వారీ దృశ్యాలు సహా వైరల్ వీడియోలో కనిపిస్తున్న బైక్ ర్యాలీ ఉంది. అలాగే ర్యాలీలో పాల్గొన్న వారిలో కొంతమందిని పోలీసులు ఆపి కొట్టడం కూడా ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఈ ర్యాలీ మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగిందని ఇది నిర్ధారిస్తుంది.
ఈ విషయాన్ని వెరిఫై చేయడానికి, మేము తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, 19 ఫిబ్రవరి 2025న ఈ ర్యాలీకి సంబంధించి టైమ్స్ ఆఫ్ ఇండియా, ‘saam tv’(ఇక్కడ, ఇక్కడ) మరియు ‘Pudari News’ వారు ప్రచురించిన వార్తా కథనాలు మాకు లభించాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, కర్ణాటకలోని చించలిలో జరిగే మాయక్కా దేవి వార్షిక ఉత్సవం నుండి తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వందలాది మంది బైకర్లు తిరిగి వస్తూ, హారన్లు మోగిస్తూ, ఉత్సాహంగా నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. ఈ పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది, దీని ఫలితంగా దాదాపు 45 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. సాంగ్లి నగరంలో గుర్రపు బండ్ల రేసింగ్‌కు అనుమతి లేదని, కానీ చాలా మంది యువకులు గుర్రపు బండ్లు, మోటర్ సైకిల్‌లతో ఆ ప్రాంతంలోకి ప్రవేశించారని సాంగ్లి రూరల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ చౌగులే తెలిపారు.
కర్ణాటకలోని చించలిలో మాఘి పౌర్ణమి నాడు మాయక్క దేవీని పూజించుకొని తిరిగి వస్తున్న కొందరు యువకులు అర్ధరాత్రి వేల గందరగోళం చేశారు అని, వీరిని అదుపులో పెట్టడానికి పోలీసులు వారిని కొట్టారని ‘saam tv’ వారు తమ కథనంలో పేర్కొన్నారు. దీన్ని బట్టి ఈ సంఘటన మహారాష్ట్రలోని సాంగ్లిలో జరిగింది అని, దీనికీ ముర్షిదాబాద్‌లో ఇటీవల, అనగా ఏప్రిల్ 2025లో జరిగిన మతపరమైన మారణకాండకు ఎటువంటి సంబంధం లేదు అని మనకు అర్థం అవుతుంది.
అదనంగా, అసలు ఇటీవల బజరంగ్ దళ్ కలకత్తాలో ఏదైనా ర్యాలీని నిర్వహించిందా అని ఇంటర్నెట్లో వెతకగా, ఈ విషయాన్ని ద్రువీకరిస్తూ మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు దొరకలేదు.
చివరగా, మహారాష్ట్రలోని సాంగ్లీలో ఫిబ్రవరి 2025 లో జరిగిన ఒక ర్యాలీ దృశ్యాలను పశ్చిమ బెంగాల్‌కు వెళ్తున్న బజరంగ్ దళ్ ర్యాలీ వీడియో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.