చైనాకు సంబంధించిన పాత ఫోటోని శరీర దానం చేసిన సీతారాం ఏచూరికి డాక్టర్లు గౌరవ వందనం తెలుపుతున్న ఫోటో అని తప్పుగా షేర్ చేస్తున్నారు

శరీర దానం చేసిన సీతారాం ఏచూరికి డాక్టర్లు గౌరవ వందనం తెలుపుతున్న ఫోటో అంటూ కొంతమంది డాక్టర్లు ఒక మృతదేహం ముందు తమ తలలు వంచి నిలబడ్డ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చెయ్యబడుతోంది. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. 

ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇది శరీర దానం చేసిన సీతారాం ఏచూరికి డాక్టర్లు గౌరవ వందనం తెలుపుతున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఇది శరీర దానం చేసిన సీతారాం ఏచూరికి డాక్టర్లు గౌరవ వందనం తెలుపుతున్న ఫోటో కాదు. ఇది 2016లో చైనాలోని  ఒక ఆసుపత్రిలో తీసిన ఫోటో. తూర్పు చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌కు చెందిన 41 ఏళ్ల డాక్టర్ జావో జు, ఒక వైద్యుల బృందంతో కలిసి టిబెట్ అటానమస్ రీజియన్‌లోని షానాన్‌లో పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సేవలు కొనసాగిస్తున్న సమయంలో అతను ‘బ్రెయిన్ అనూరిజం’ అనే దానితో బాధపడ్డాడు, అది తరువాత అతని మరణానికి దారితీసింది. జావో కుటుంబం అతని చివరి కోరికలను గౌరవించి అతని మూత్రపిండాలు, కాలేయం మరియు కార్నియాలను దానం చేసింది. ఆయన సహచర డాక్టర్లు ఇలా వందనం తెలిపారు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

సీతారాం ఏచూరి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ 12 సెప్టెంబర్ 2024న మరణించారు (ఇక్కడ మరియు ఇక్కడ). కానీ, వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూస్తే, ఈ ఫోటో 2020 నుండి సోషల్ మీడియాలో షేర్ చెయ్యబడింది అని గమనించాం.

ఈ ఫోటో గురించి మరింత వెతికితే, “చైనీస్ డాక్టర్ టిబెట్‌లో స్వచ్ఛంద సేవ చేస్తూ మరణించాడు, అతని అవయవాలను దానం చేశాడు” అనే శీర్షికతో 30 సెప్టెంబర్ 2016న ప్రచురించబడ్డ ఒక చైనీస్ న్యూస్ రిపోర్టు మాకు లభించింది. ఈ రిపోర్టు ప్రకారం, తూర్పు చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌కు చెందిన 41 ఏళ్ల డాక్టర్ జావో జు, ఒక వైద్యుల బృందంతో కలిసి టిబెట్ అటానమస్ రీజియన్‌లోని షానాన్‌లో పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సేవలు కొనసాగిస్తున్న సమయంలో అతను ‘బ్రెయిన్ అనూరిజం’తో బాధపడ్డాడు, అది తరువాత అతని మరణానికి దారితీసింది. జావో కుటుంబం అతని చివరి కోరికలను గౌరవించి అతని మూత్రపిండాలు, కాలేయం మరియు కార్నియాలను దానం చేసింది. 

చైనాలో పెరుగుతున్న అవయవ దానంపై చర్చిస్తూ వెబ్‌సైట్ సిక్స్త్ టోన్‌ 2018 కథనం ఈ ఫోటోను ప్రచురించింది. ఈ కథనం ప్రకారం, ఇది శస్త్రచికిత్స తర్వాత అవయవ దాతకు వైద్యులు మరియు నర్సులు నివాళి అర్పిస్తున్న ఫోటో. ఇది 29 సెప్టెంబరు 2016న అన్‌హుయ్ ప్రావిన్స్‌లోని హెఫీలోని ఒక ఆసుపత్రిలో రోగికి ఉపయోగపడే అవయవాలను తొలగించిన తర్వాత తీసిన ఫోటో అని ఈ ఆర్టికల్ పేర్కొంది. దీని గురించి రష్యన్ మీడియా కూడా ప్రచురించింది. 

చివరిగా, చైనాకు సంబంధించిన పాత ఫోటో శరీర దానం చేసిన సీతారాం ఏచూరికి డాక్టర్లు గౌరవ వందనం తెలుపుతున్న ఫోటో అని షేర్ చేస్తున్నారు.