వందే భారత్ రైల్లో విద్యార్థులు RSS గేయం పాడినందుకు ఒక స్కూల్‌పై కేరళ ప్రభుత్వం దర్యాప్తుకు వ్యతిరేకంగా హిందువులు చేపట్టిన ప్రదర్శన అని చెప్తూ పాత వీడియోను షేర్ చేస్తున్నారు

8 నవంబర్ 2025న కేరళలో ఎర్నాకులం-బెంగళూరు మధ్యలో వందే భారత్ రైలు ప్రారంభించబడింది. ఈ ప్రారంభ వేడుకల్లో సరస్వతి విద్యాలయ స్కూల్ విద్యార్థులు రైల్లో RSS గేయం పాడారని ఆరోపిస్తూ ఆ స్కూల్‌పై కేరళ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ నిర్ణయం పై బీజేపీ నాయకులు కూడా స్పందించారు (ఇక్కడ, ఇక్కడ).

ఈ నేపథ్యంలో, కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా హిందువులంతా ఏకమై ఒక ప్రదర్శన చేశారని చెప్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని నూరిపోస్తున్న మదర్సాలను ఎప్పడు రద్దు చేస్తారని వారు ఈ ప్రదర్శన సందర్భంగా కోరారని, దీని తర్వాత ప్రభుత్వం (సీఎం) ఆ దర్యాప్తు నోటీసును వెనక్కి తీసుకుందని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నవంబర్ 2025లో ఎర్నాకులం-బెంగళూరు మధ్య ప్రారంభించబడిన వందే భారత్ రైల్లో  సరస్వతి విద్యాలయ స్కూల్ విద్యార్థులు పాడిన పాట ‘RSS గేయం’ అని చెప్తూ ఆ స్కూల్ పైన కేరళ ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తుకు వ్యతిరేకంగా కేరళలో జరిగిన ఒక ప్రదర్శనకు చెందిన వీడియో.

ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో గుజరాత్‌లోని వడోదరలో తీసింది. దీనికి, కేరళకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియో కనీసం మార్చి 2023 నుంచి ఇంటర్నెట్‌లో ఉంది. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, ముందుగా అసలు కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కేరళలలో ఇటీవల ఏదైనా ప్రదర్శన జరిగిందా అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వతికాము. కానీ, మాకు ఈ విషయానికి రుజువుగా ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేదు. 

ఇక, వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాల కోసం అందులోని కాన్ కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసాము. ఈ సెర్చ్ ద్వారా ఈ వీడియో ఉన్న మార్చ్ 2023 నాటి యూట్యూబ్ పోస్ట్ ఒకటి మాకు లభించింది. దీన్ని బట్టి, ఈ వీడియోకు నవంబర్ 2025న కేరళ ప్రభుత్వం సరస్వతి విద్యాలయ స్కూల్ మీద చేపట్టిన దర్యాప్తుకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం అవుతుంది.

ఈ 2023 నాటి యూట్యూబ్ పోస్టులో, వైరల్ వీడియో కంటే మంచి క్వాలిటీ వెర్షన్ ఉంది. ఈ వీడియోలో మొదటి ఫ్రేములో మనం ఎడమ పక్కన ఒక బిల్డింగ్ చూడవచ్చు. దాని పైన ‘Tulsi’ అని రాసి ఉంది. అలాగే, ‘જે. ચંદુલાલ જ્વેલર્સ’ అని గుజరాతీ భాషలో రాసి ఉన్న ఒక బోర్డు కూడా ఆ బిల్డింగ్ పైన ఉంది. దీన్ని గూగుల్ ట్రాన్సలేట్ ఉపయోగించి ఆంగ్లంలోకి అనువదించి చూడగా అది ‘J Chandulal Jewelersఅని మాకు తెలిసింది. 

ఈ క్లూ ఉపయోగించి ఈ బిల్దింగ్‌ను మేము గూగుల్ మ్యాప్స్‌లో కనుగొన్నాము. ఇది గుజరాత్‌లోని వడోదరలో ఉన్న ‘1 మాండ్వి బజార్ రోడ్డు’లో ఉంది.

అయితే, ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ఏ ర్యాలీకి చెందినవి అనేది మాకు పూర్తిగా తెలియలేదు. కానీ, వీడియోలో కనిపిస్తున్న నంది విగ్రహం, వడోదరలో మహా శివరాత్రి సందర్భంగా జరిగే ‘Shiv Ji ki Savari’ ఊరేగింపులో ప్రదర్శించే నంది విగ్రహం లాగా ఉంది (ఇక్కడ, ఇక్కడ). ఈ వీడియో కూడా అటువంటి ఒక మతపరమైన ఊరేగింపుకు చెందినదే అయి ఉండవచ్చు. 

చివరగా, కేరళలో నవంబర్/డిసెంబర్ 2025లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శన దృశ్యాలని చెప్తూ వడోదరలో తీసిన సంబంధం లేని ఒక పాత వీడియోను షేర్ చేస్తున్నారు.