26 జూన్ 2025న ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న మలిహాబాద్‌లో అక్రమ ఆయుధాల తయారీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ కేసులో నిందితుడు హకీమ్ సలావుద్దీన్ మలిహాబాద్‌లో ఒక క్లినిక్ నడుపుతూ తన ఇంటి నుండి అక్రమ తుపాకీల స్మగ్లింగ్ చేసేవాడని వార్తా కథనాల్లో పేర్కొన్నారు. పాకిస్తాన్, దుబాయ్‌లతో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న సలావుద్దీన్ ఇంటి నుండి ఆరు పిస్టల్స్, ఏడు ఎయిర్‌గన్‌లు, ఒక రైఫిల్, 150పైగా కార్ట్రిడ్జ్‌లు (కొన్ని వార్తా కథనాల్లో ఈ సంఖ్య 3000-50,000 వరకు ఉంది), 2000 రూపాయల క్యాష్, జింక చర్మాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో హకీమ్ ఇంట్లో దొరికిన 3,000 తుపాకులు, 50,000 బుల్లెట్ కార్ట్రిడ్జ్‌లు, 20 బస్తాల నిండా డాలర్ల కరెన్సీ నోట్లకు చెందిన దృశ్యాలని చెప్తూ ఒక ఫోటో, వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: 26 జూన్ 2025న ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో హకీమ్ సలావుద్దీన్ అనే వ్యక్తి ఇంట్లో దొరికిన అక్రమ తుపాకీలు, క్యాష్, బుల్లెట్ కార్ట్రిడ్జ్‌లను చూపిస్తున్న ఫోటో, వీడియో.
ఫ్యాక్ట్(నిజం): వైరల్ అవుతున్న ఫోటో, వీడియో రెండూ, 26 జూన్ 2025న హకీమ్ సలావుద్దీన్ ఇంట్లో పోలీసులు అక్రమ ఆయుధాలు పట్టుకోక ముందు నుంచే ఇంటర్నెట్లో ఉన్నాయి. కాబట్టి, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
ముందుగా, వైరల్ అవుతున్న ఫోటో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో ఆ ఫోటోను ఉపయోగించి ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా ఈ ఫోటో యొక్క ఎడిట్ చేయని వెర్షన్ మాకు ‘X’లో దొరికింది (ఆర్కైవ్). ఈ ఫోటోను Gun Lover అనే పేజీ వారు అక్టోబర్ 2021లో అప్లోడ్ చేశారు.
ఇదే ఫోటో యొక్క వేరే వెర్షన్లు ఇంటర్నెట్లో కనీసం 2017 నుంచి ఉన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). దీన్ని బట్టి ఈ ఫొటోకు 26 జూన్ 2025 ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో హకీమ్ సలావుద్దీన్ ఇంట్లో పట్టుబడ్డ ఆయుధాలకు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఎటువంటి సంబంధం లేదని మనకు స్పష్టం అవుతుంది.
అదనంగా, ఈ ఫోటో అమెరికాలోని అయోవాలో ఉన్న ఉన్న అయోవా డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ (DCI) వారి బ్యాలిస్టిక్స్ ల్యాబులో తీసినదని మాకు ఈ సెర్చ్ ద్వారా తెలిసింది. DCI వారు తమ అధికారిక వెబ్సైటులో అప్లోడ్ చేసిన ఒక యూట్యూబ్ వీడియోలో వైరల్ ఫొటోలో కనిపుస్తున్న గన్నుల ర్యాక్ చూడవచ్చు.
ఇక వైరల్ వీడియో విషయానికి వస్తే, అందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అందులోని దృశ్యాలున్న వీడియోలు కనీసం 2021 నుంచి ఇంటర్నెట్లో ఉన్నాయని మాకు తెలిసింది.
వైరల్ వీడియోలో ఉన్న మూడు క్లిప్పులతో కూడిన వీడియోని 26 మార్చ్ 2023న ‘Graham Allen’ అనే వ్యక్తి ‘బైడెన్ దీన్ని మొత్తాన్ని తాలిబాన్‌కు వదిలేశాడు’ అనే వివరణతో ‘X’లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలను ఆఫ్ఘనిస్థాన్‌లో చితీసారా లేదా మరో చోటా తీశారా అనే వివరాలు మేము కనుగొనలేకపోయినప్పటికీ, జూన్ 2025 కంటే ముందు నుంచే ఈ వీడియో క్లిప్పులు ఇంటర్నెట్లో చలామణిలో ఉన్నాయి కాబట్టి, వాటికి హకీమ్ సలావుద్దీన్ అక్రమ ఆయుధాల కేసుకు ఎటువాంటి సంబంధం లేదని మనకు స్పష్టం అవుతుంది.
చివరగా, ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో హకీమ్ సలావుద్దీన్ ఇంట్లో పోలీసులు పట్టుకున్న అక్రమ ఆయుధాల దృశ్యాలు అని సంబంధం లేని పాత ఫోటో మరియు వీడియో క్లిప్పులు తప్పుగా షేర్ చేస్తున్నారు.