‘ఈతరం పిల్లలు కష్టపడి చదవక పోతే భవిష్యత్ లో కూలి పని కూడా దొరకదు,’ అని అంటూ, రోబోట్లు రకరకాల పనులు చేస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: ఫ్లోర్ తుడవడం, శుభ్రం చేయడం, ప్లాస్టరింగ్ వంటి మనుషులు చేసే పనులని రోబోట్లు చేస్తున్నాయి, దానికి సంబంధించిన వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్/విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించి తయారు చేసిన వీడియో, నిజంగా రోబోట్లు ఈ పనులు చేస్తుండగా తీసిన వీడియో కాదు. కావున, వైరల్ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ వీడియో యొక్క వాస్తవికతను వెరిఫై చేసే క్రమంలో ముందుగా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా, చాలా చోట్ల ఈ వీడియోలో కొన్ని తప్పులు మాకు కనిపించాయి. కొన్ని చోట్ల రోబోట్ గాల్లో ఉన్నట్లు ఉంటుంది, అది పట్టుకున్న వస్తువుకి దాని చేతికి, మధ్యలో దూరం ఉంటుంది, కొన్ని సార్లు అయితే ఆ పరికరాలు మాయం అయిపోవడం కూడా మనం గమనించవచ్చు.
వైరల్ వీడియోలో ఇలాంటి తప్పులు గమనించాక, ఈ వీడియోని కంప్యూటర్ గ్రాఫిక్స్/ విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించి తయారు చేసి ఉంటారు అనే అనుమానం మాకు వచ్చింది. ఈ విషయాన్ని వెరిఫై చేయడానికి, వైరల్ వీడియోలో ఉన్న కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చెక్ చేస్తే, వైరల్ వీడియోలో ఉన్న మొదటి క్లిప్ యొక్క అసలు వెర్షన్ మాకు దొరికింది(ఇక్కడ, ఇక్కడ), ఈ వీడియోలో ఒకతను ఒక సూపర్ మార్కెట్లో ఒక అరుదైన పద్ధతిలో క్లీనింగ్ చేయడం మనం చూడవచ్చు.
ఈ వ్యక్తి ఈ పద్ధతిలో నేలను క్లీన్ చేస్తున్న వీడియోలు ఇంటర్నెట్లో చాలా ఉన్నాయి(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ వీడియోలలో వేటిలో కూడా, వైరల్ వీడియోలో ఉన్నటువంటి తప్పులు లేవు. వైరల్ వీడియోకి తన వీడియోకి ఉన్న పోలికని మీరు ఈ కింది గ్రాఫిక్‌లో చూడచ్చు.
దీన్ని బట్టి, ఇలాంటి వీడియో క్లిప్స్ ఉపయోగించి, దాని మీద కంప్యూటర్ గ్రాఫిక్స్/విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించి ఎడిట్ చేసి తయారు చేశారని మనకి స్పష్టంగా అర్థం అవుతోంది.
చివరిగా, ఒక ఎడిటెడ్ వీడియోని షేర్ చేస్తూ, రోబోట్లు మనుషులు చేసే పనులు చేస్తున్న నిజమైన వీడియో అని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు.