‘మీరు పట్టుకున్న రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయి’ అని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పలేకపోయాడు అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ‘రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయి’ అని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పలేకపోయాడు, అందుకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 01 జూలై 2024న రాష్ట్రపతి ప్రసంగంపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రసంగిస్తూ, ప్రతిపక్ష ఎంపీలను ఉద్దేశిస్తూ “నేను మీ అందరినీ మరో ప్రశ్న అడగాలనుకుంటున్నాను, రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయి? ఎన్ని ఎన్ని, ఇలా ఇంత ఉంటుంది అని చెప్పకండి, ఎన్ని పేజీలు ఉన్నాయో చెప్పండి? రోజూ దాన్ని (రాజ్యాంగ ప్రతిని) పట్టుకొన్ని తిరుగుతున్నరు, ఒక్కసారి కూడా చదవలేదా?” అని అన్నారు. ‘సంసద్ టీవీ’ యూట్యూబ్‌లో షేర్ చేసిన అనురాగ్ ఠాకూర్ ప్రసంగం వీడియోను పూర్తిగా పరిశీలిస్తే, అనురాగ్ ఠాకూర్ ప్రసంగిస్తున్నప్పుడు రాహుల్ గాంధీ లోక్‌సభలో లేరని తెలుస్తోంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ క్లెయిమ్ మరియు ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వైరల్ వీడియో యొక్క పూర్తి నిడివి గల వీడియోని యూట్యూబ్‌లో 01 జూలై 2024న ‘Sansad TV’(భారత పార్లమెంట్ సమావేశాల యొక్క అధికారిక ఛానల్) “Anurag Thakur’s Remarks | Motion of Thanks on the President’s Address in 18th Lok Sabha ” అనే శీర్షికతో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వీడియో 01 జూలై 2024న రాష్ట్రపతి ప్రసంగంపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగానికి సంబంధించింది.
ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, ఈ వైరల్ వీడియో క్లిప్ టైమ్‌స్టాంప్ 56:36 వద్ద ప్రారంభమవుతుందని తెలిసింది. టైమ్‌స్టాంప్ 56:33 వద్ద అనురాగ్ ఠాకూర్ ప్రతిపక్ష ఎంపీలను ఉద్దేశిస్తూ “నేను మీ అందరినీ మరో ప్రశ్న అడగాలనుకుంటున్నాను, రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయి? ఎన్ని ఎన్ని, ఇలా ఇంత ఉంటుంది అని చెప్పకండి,ఎన్ని పేజీలు ఉన్నాయో చెప్పండి? రోజూ దాన్ని(రాజ్యాంగ ప్రతిని) పట్టుకొన్ని తిరుగుతున్నరు, ఒక్కసారి కూడా చదవలేదా?” అని అనడం మనం చూడవచ్చు. అనురాగ్ ఠాకూర్ ఈ ప్రశ్న అడగడంతో కెమెరా ప్రతిపక్ష బెంచీల వైపు వెళ్ళింది, కానీ రాహుల్ గాంధీ అక్కడ కనిపించలేదు.
ప్రతిపక్ష నేత ప్రతిపక్ష ఎంపీలకు కేటాయించిన బెంచీలలో ముందు వరుసలోని సీటులో మాత్రమే కూర్చుంటారు. రాహుల్ గాంధీ 18వ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు, కావున ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ప్రతిపక్ష ఎంపీల బెంచ్ లో ముందు వరుసలో కూర్చుంటాడు. ఈ పూర్తి వీడియోను మనం జాగ్రతగా గమనిస్తే, సభలో ఎక్కడ రాహుల్ గాంధీ ఉన్నట్లు మనకు కనిపించరు, రాహుల్ గాంధీ కుర్చోన్నే ముందు వరుసలో సీటు మనకు ఈ ప్రసంగం అంత ఖాళీగానే కనిపిస్తుంది.
తదుపరి వైరల్ వీడియోలో రాహుల్ గాంధీ యొక్క భాగం కోసం వెతకగా, 01 జూలై 2024న రాష్ట్రపతి ప్రసంగంపై రాహుల్ గాంధీ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోలో కొంత భాగాన్ని తీసుకొన్ని ఈ వైరల్ వీడియోకి జోడించారని తెలిసింది. ఈ వీడియోలో రాహుల్ గాంధీ ముందు వరుసలో సీటులో ఉండడం చూడవచ్చు. ఈ రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన వీడియోను ‘సంసద్ టీవీ’ యూట్యూబ్ ఛానెల్‌లో చూడవచ్చు(ఇక్కడ). దీన్ని బట్టి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పార్లమెంటులో 01 జూలై 2024న చేసిన ప్రసంగం వీడియోను ఎడిట్ చేసి, రాహుల్ గాంధీకి సంబంధించిన వేరొక వీడియో జోడించి ఈ వైరల్ వీడియో రూపొందించారని మనం నిర్థారించవచ్చు.
చివరగా, ‘రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయి’ అని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పలేకపోయాడు అంటూ ఒక ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు.