ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ “ఈ ఎన్నికల్లో మీ బిడ్డ, మీ బిడ్డ ఒక్కడు అందరినీ మోసం చేశాడు కాబట్టి చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి, ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికల్లో యుద్ధానికి” అని అన్నట్లు వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజేమెంటో చూద్దాం.
క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ తాను ప్రజలను అందరినీ మోసం చేశాను అని చెప్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 19 ఏప్రిల్ 2024న కాకినాడలో జరిగిన వైసీపీ ఎన్నికల బహిరంగ సభలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ “ఈ ఎన్నికల్లో ఇంటింటికీ మీ బిడ్డ మంచి చేశాడు కాబట్టి, మీ బిడ్డ ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి, అందరినీ మోసం చేశాడు కాబట్టి చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి, కూటమిగా వారందరు కూడా ఏకం అయ్యారు” అని అన్నారు. ఐతే ఈ వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చేసి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తాను ప్రజలను మోసం చేశాను అని అంగీకరించినట్లు అర్ధం వచ్చేలా వైరల్ వీడియోని రూపొందించారు. వాస్తవంగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అందరికీ మంచి చేశాను అని, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రజలకు ఎలాంటి మంచి చేయలేదు అని విమర్శించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియో గురించి మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఇవే దృశ్యాలు కలిగిన పూర్తి నిడివి గల వీడియోని 19 ఏప్రిల్ 2024న సాక్షి టీవీ (Sakshi TV live) తమ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో “LIVE : తండ్రినే వెన్నుపోటు పొడిచిన వదినమ్మ | CM YS Jagan Mass Speech | Kakinada” అనే శీర్షికతో లైవ్ టెలికాస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో యొక్క వివరణలో, ఈ వీడియో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలోని అచ్చంపేట జంక్షన్ వద్ద జరిగిన వైసీపీ ఎన్నికల బహిరంగ సభకు సంబంధించింది అని తెలిసింది.
ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, వైరల్ వీడియో క్లిప్పింగ్ లోని దృశ్యాలు టైంస్టాంప్ 22:55 వద్ద మొదలై, టైంస్టాంప్ 23:16 వద్ద ముగుస్తుంది అని తెలిసింది. వాస్తవంగా, ఈ బహిరంగ సభలో ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ “ఈ ఎన్నికల్లో ఇంటింటికి మీ బిడ్డ మంచి చేశాడు కాబట్టి, మీ బిడ్డ ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి, అందరినీ మోసం చేశాడు కాబట్టి చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి, కూటమిగా వారందరు కూడా ఏకం అయ్యారు, మీ బిడ్డ ఒక్కడు, నక్కలు తోడేలు అనేక మంది” అని అన్నారు. దీన్ని బట్టి అసలు వీడియోను ఎడిట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తాను ప్రజలను మోసం చేశాను అని ఒప్పుకున్నారు అని అర్ధం వచ్చేలా వైరల్ వీడియోని రూపొందించారు అని నిర్ధారించవచ్చు. వాస్తవంగా, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తాను అందరికీ మంచి చేశాను అని, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రజలకు ఎలాంటి మంచి చేయలేదు అని విమర్శించారు.
చివరగా, ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తాను ప్రజలను మోసం చేశాను అని ఒప్పుకున్నారు అంటూ ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు.