పాకిస్థాన్‌కు చెందిన ఫుడ్ రిటైలర్ ఉద్యోగుల పేర్లు చూపిస్తున్న ఎడిట్ చేసిన స్క్రీన్‌ షాట్‌ను టీటీడీకి నెయ్యి సరఫరా చేసే తమిళనాడుకు చెందిన సంస్థకు సంబంధించిందిగా షేర్ చేస్తున్నారు

తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) నెయ్యి సరఫరా చేసే A.R డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ముస్లింల ఆధ్వర్యంలో నడుస్తోంది అంటూ AR ఫుడ్స్ (ప్రైవేట్) లిమిటెడ్ పాకిస్తాన్‌కు చెందిన సంస్థ అని తెలిపే ఒక స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవమేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) నెయ్యి సరఫరా చేసే A.R డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ముస్లింల ఆధ్వర్యంలో నడుస్తోంది. 

ఫాక్ట్ (నిజం): తమిళనాడులోని AR డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ TTDకి ప్రసాదం కోసం నెయ్యి సరఫరా చేసే సంస్థల్లో ఒకటి. దీని డైరెక్టర్లు రాజశేఖరన్ ఆర్, సూర్య ప్రభ ఆర్ మరియు శ్రీనివాసన్ ఎస్ఆర్. కానీ, వైరల్ స్క్రీన్‌షాట్‌లోని కంపెనీ పేరు AR ఫుడ్స్ (ప్రైవేట్) లిమిటెడ్, ఇది పాకిస్తాన్ కి చెందిన ఒక కంపెనీ . ఇవి ఒకే పేరుతో ఉన్న రెండు వేర్వేరు కంపెనీలు. వైరల్ స్క్రీన్‌షాట్‌లో కీలకమైన వివరాలు, ప్రత్యేకంగా ఉద్యోగుల దేశం (పాకిస్తాన్) అని తెలిపే వివరాలు తీసేసి ఇది టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన కంపెనీకి సంబంధించింది అని తప్పుగా షేర్ చేస్తున్నారు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం చేయడానికి ఉపయోగించే నెయ్యిలో “గొడ్డు మాంసం కొవ్వు,” “పంది కొవ్వు” మరియు “చేపనూనె” ఉన్నాయని ఒక రిపోర్టు పేర్కొన్న తర్వాత వివాదం మొదలయ్యింది. తమిళనాడులోని AR డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ TTDకి ప్రసాదం కోసం నెయ్యి సరఫరా చేసే సంస్థల్లో ఒకటి. కానీ, వైరల్ స్క్రీన్‌షాట్‌లోని కంపెనీ పేరు AR ఫుడ్స్ (ప్రైవేట్) లిమిటెడ్ అని ఉంది. అవి ఒకే పేర్లతో ఉన్న రెండు వేర్వేరు కంపెనీలు.

తిరుమల ఆలయ నైవేద్యాలకు నెయ్యి సరఫరా చేసేవారిలో ఒకరు తమిళనాడుకు చెందిన AR డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్. తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, ఇలాంటి రెండు కంపెనీలు ఉన్నాయని మేము తెలుసుకున్నాం. వాటిలో ఒకటి భారతదేశంలో AR డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఉండగా, మరొకటి, పాకిస్తాన్‌లో AR ఫుడ్స్ (ప్రైవేట్) లిమిటెడ్ అనే పేరుతో ఉందని రాకెట్ రీచ్ అనే వెబ్సైట్ ద్వారా కనుగొన్నాం.

దీని గురించి మరింత వెతికితే, ఇదే వెబ్సైట్, పాకిస్తాన్ కంపెనీ ప్రొఫైల్‌లో దాని పెద్ద స్థాయిలో ఉద్యోగులను లిస్ట్ చేసింది అని మేము కనుగొన్నాము. ఈ సమాచారాన్ని వైరల్ స్క్రీన్‌షాట్‌తో పోల్చినప్పుడు, రెండూ ఒకే కంపెనీని సూచిస్తున్నట్లు స్పష్టమైంది. అయితే, వైరల్ స్క్రీన్‌షాట్‌లో కీలకమైన వివరాలు, ప్రత్యేకంగా ఉద్యోగుల దేశం (పాకిస్తాన్) అని తెలిపే వివరాలు తీసేసి ఇది టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన కంపెనీకి సంబంధించింది అని తప్పుగా షేర్ చేస్తున్నారు అని అర్థమైంది. రెండు స్క్రీన్ షాట్ల మధ్య పోలికను కింద చూడవచ్చు.


ఈ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ఇది పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉందని నిర్ధారిస్తుంది. ఈ సంస్థ 1970లో స్థాపించబడింది. వెబ్‌సైట్ ప్రకారం, “A.R. ఫుడ్స్” పాకిస్తాన్‌లో ఇంటి పేరుగా చాలా కాలంగా ఖ్యాతిని కలిగి ఉంది. కంపెనీ పాకిస్తానీ వంటశాలలో అంతర్భాగంగా భావించబుడుతుంది. ఈ కంపెనీ తన అధిక-నాణ్యత కలిగిన ఉత్పత్తులలు ప్రసిద్ధి చెందింది (అనువదించబడింది).”


ఇకపోతే , “AR Dairy Food Private Limited” గురించి వెతకగా, ఇది రాజ్ మిల్క్ అధికారిక వెబ్‌సైట్‌కి దారితీసింది. దీని ద్వారా, ఈ కంపెనీ తమిళనాడులోని దిండిగల్‌లో ఉందని, ఇది 1995లో స్థాపించబడిందని తెలుసుకున్నాం. వెబ్‌సైట్‌లోని డైరెక్టర్ల విభాగం రాజశేఖరన్ ఆర్‌ని మేనేజింగ్ డైరెక్టర్‌గా, సూర్య ప్రభ ఆర్. మరియు శ్రీనివాసన్ ఎస్‌ఆర్ డైరెక్టర్‌లుగా పేర్కొంది. అంతే కాకుండా, టెక్నికల్ టీమ్ కూడా వైరల్ పోస్టులో ఉన్న పేర్లతో సరిపోలలేదు.

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ కూడా ఈ కంపెనీకి రాజశేఖరన్ సూర్యప్రభ మరియు శ్రీనివాసలునాయుడు రామ్‌చంద్రన్ శ్రీనివాసన్‌లు డైరెక్టర్లుగా, రాజు రాజశేఖరన్ MDగా పేర్కొంది. దీనికి సంబంధించి పలు మీడియా రిపోర్ట్స్ కూడా ప్రచురించబడ్డాయి (ఇక్కడ మరియు ఇక్కడ). అంతే కాకుండా నెయ్యి నాణ్యతలో రాజీ లేదని స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు టిటిడి వెబ్‌సైట్‌లో తెలిపారు.

చివరిగా, పాకిస్థాన్‌కు చెందిన ఫుడ్ రిటైలర్ ఉద్యోగుల పేర్లు చూపిస్తున్న ఎడిట్ చేసిన స్క్రీన్‌ షాట్‌ను టీటీడీకి నెయ్యి సరఫరా చేసే తమిళనాడుకు చెందిన సంస్థకు సంబంధించిందిగా తప్పుగా షేర్ చేస్తున్నారు.