‘శబ్దం చేయవద్దు..హిందువు నిద్రపోతున్నాడు,’ అని ఆటో వెనకాల రాసి ఉన్న ఈ ఫోటో డిజిటల్‌గా ఎడిట్ చేయబడింది

‘శబ్దం చేయవద్దు..హిందువు నిద్రపోతున్నాడు,’ అని ఒక ఆటో వెనుక రాసి ఉన్న ఫోటో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని ఒక ఆటో పైన ఇలా రాసి ఉంది అని క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: ‘శబ్దం చేయవద్దు..హిందువు నిద్రపోతున్నాడు,’ అని ఒక కర్ణాటకలోని ఆటో కవర్‌పైన రాసి ఉన్న ఫోటో.

ఫ్యాక్ట్(నిజం): ఇది డిజిటల్‌గా ఎడిట్ చేసిన ఫోటో. ఇంటర్నెట్లో ఉన్న ఒక స్టాక్ ఫోటోని ఎడిట్ చేసి ఈ ఫోటోని తయారు చేశారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వైరల్ ఫోటోను ఇంటరెనేట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చెక్ చేస్తే, ఈ ఫోటో యొక్క ఒరిజినల్ వెర్షన్ మాకు ‘desiphotos.com’ అనే రాయల్టీ ఫ్రీ స్టాక్ ఫోటోలు ఉండే వెబ్సైటులో దొరికింది.  

ఈ ఫోటోని ‘Eugunef’ అనే ఫోటోగ్రాఫర్ తీశారు. ఈ ఫోటో కింద ఉన్న వివరణను బట్టి, దీన్ని ఢిల్లీలో తీశారు. ‘Eugunef’ తీసిన మరో స్టాక్ ఫొటోలో కూడా ఇదే ఆటోని మేము చూసాము, ఈ ఫోటోను తను ‘Adobe Stock’ అనే స్టాక్ ఫోటో వెబ్సైటులో అప్లోడ్ చేశారు. దీనిబట్టి, ఈ ఆటో యొక్క స్టాక్ ఫోటోని ఎడిట్ చేసి-అంటే, టెక్స్ట్ యాడ్ చేసి, ఫోటోను క్రాప్ చేసి- వైరల్ ఫోటోను తయారు చేశారు అని మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. 

ఈ ఫోటో గురించి వెతుకుతున్న క్రమంలో, మాకు ఇదే ఆటో పైన కన్నడ భాషలో  ‘శబ్దం చేయవద్దు..హిందువు నిద్రపోతున్నాడు,’ అని రాసి ఉన్న కొన్ని సోషల్ మీడియా పోస్టులు (ఇక్కడ, ఇక్కడ) మాకు దొరికాయి.

వీటిని మేము ఫొటోలని విశ్లేషించి/అనలైజ్ చేసి, వాటిలోని తప్పిదాలను గుర్తు పట్టే  వెబ్సైటులు ‘FotoForensics’ మరియు ‘Forensically’లలో చెక్ చేశాము. వీటిలో ఉన్న ‘Error Level Analysis’ అనే టూల్ ద్వారా చెక్ చేస్తే, ఈ ఫొటోలో టెక్స్ట్ ఉన్న పోర్షన్ ఎడిట్ చేయబడింది (ఇక్కడ, ఇక్కడ) అని మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. దీన్ని తెలుగులోకి తర్జుమా చేసి వైరల్ చేస్తున్నారు. 

చివరిగా, హిందువులని విమర్శిస్తూ కర్ణాటకలోని ఒక ఆటో పైన ‘శబ్దం చేయవద్దు..హిందువు నిద్రపోతున్నాడు,’ అని రాసి ఉన్న ఈ ఫోటో డిజిటల్‌గా ఎడిట్ చేయబడింది.