హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై 420 అనే ప్రకటనలు ప్రదర్శించబడ్డాయని పేర్కొంటూ ఎడిట్ చేసిన ఫోటోను షేర్ చేస్తున్నారు

“హైదరాబాద్‌లోని మెట్రో పిల్లర్లపై 420యాడ్స్ కలకలం సృష్టిస్తున్నాయి” అంటూ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ ప్రకటనలు మెట్రో పిల్లర్లపై ప్రదర్శించబడ్డాయి అంటూ ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఫొటోలో మెట్రో పిల్లర్లపై 420 అని రాసి ఉండటం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై 420 అనే ప్రకటనలు/పోస్టర్లు వేయబడ్డాయి.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ ఫోటో ఎడిట్ చేయబడింది. ‘Leadspaces’ అనే బహిరంగ ప్రకటనల సంస్థ (యాడ్ ఏజెన్సీ) వెబ్‌సైట్‌లో ఉన్న ఫోటోను ఎడిట్ చేస్తూ ఈ వైరల్ ఫోటో రూపొందించారు. అలాగే, హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై 420 అనే ప్రకటనలు ప్రదర్శించబడలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా ఇటీవల తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై 420 అనే ప్రకటనలు/పోస్టర్లు వెలిశాయా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, అలాంటి ప్రకటనలు హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై వెలసినట్లు చెప్పే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్/ వార్తాకథనాలు మాకు లభించలేదు. ఒకవేళ హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై అలాంటి ప్రకటనలు ప్రదర్శించబడి ఉంటే, ఖచ్చితంగా పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేవి.

ఇకపోతే ఈ వైరల్ ఫోటోను జాగ్రతగా పరిశీలిస్తే, మెట్రో పిల్లర్ మీద ఉన్న ప్రకటన అస్తవ్యస్తంగా ఉండటం మరియు ప్రశ్నార్ధక (?) గుర్తు ప్రకటన/ హోర్డింగ్ బయట వరకు ఉండటం మనం చూడవచ్చు. దీన్ని బట్టి ఈ ఫోటో ఎడిట్ చేయబడి ఉండవచ్చు అని అర్థమవుతుంది.

తదుపరి ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన సమాచారం కోసం ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇలాంటి దృశ్యాలనే చూపిస్తున్న ఫోటో (ఆర్కైవ్) ఒకటి ‘Leadspaces’ అనే బహిరంగ ప్రకటనల సంస్థ (యాడ్ ఏజెన్సీ) వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయబడినమేము గుర్తించాము.

వైరల్ ఫోటోలో ఉన్న అదే మహిళను, బైక్, బస్సును ఈ ఫోటోలో కూడా మనం చూడవచ్చు. ఈ రెండు ఫోటోలను పోల్చి చూస్తే యాడ్ ఏజెన్సీ వెబ్‌సైట్‌లో ఉన్న ఫోటోను ఎడిట్ చేస్తూ ఈ వైరల్ ఫోటో రూపొందించారని అర్థమవుతోంది. ఈ  రెండు ఫోటోల మధ్య పోలికలను క్రింద చూడవచ్చు.

చివరగా, హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై 420 అనే ప్రకటనలు ప్రదర్శించబడ్డాయని పేర్కొంటూ ఎడిట్ చేసిన ఫోటోను షేర్ చేస్తున్నారు.