BRS నాయకుడు మల్లారెడ్డి ప్రధాని మోదీపై తనకున్న అభిమానాన్ని తన ఆటతో చూపించాడు అని ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు

ఒక టీవీ ఇంటర్వ్యూ గేమ్ షోలో భాగంగా మాజీ మంత్రి, BRS నాయకుడు మల్లారెడ్డి తనకు BRS అధ్యక్షుడు కేసీఆర్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అంటే ఇష్టం లేదని, ప్రధాని మోదీ అంటే ఇష్టం అని అర్ధం వచ్చేలా గేమ్ ఆడారు అని చెప్తూ ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మల్లారెడ్డి తనకు BRS అధ్యక్షుడు కేసీఆర్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అంటే ఇష్టం లేదని, ప్రధాని మోదీ అంటే ఇష్టం అని అర్ధం వచ్చేలా గేమ్ ఆడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. ఈ వీడియో 05 అక్టోబర్ 2022న దసరా సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూకి సంబంధించింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మల్లారెడ్డికి ఒక సరదా గేమ్ పెడుతుంది. ఈ సరదా ఆటలో వాస్తవంగా, మల్లారెడ్డి తనుకు మోదీ అంటే ఇష్టం లేనట్లు, కేసీఆర్, కేటీఆర్‌ అంటే ఇష్టం ఉందని తన ఆట ద్వారా చెప్పారు. కావున, పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం, పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన పూర్తి నిడివి గల వీడియోని 05 అక్టోబర్ 2022న TV9 Telugu తమ యూట్యూబ్ ఛానల్ లో “iSmart Team special chit chat with Minister Malla Reddy” అనే శీర్షికతో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో 2022 దసరా సందర్భంగా జరిగిన ఒక సరదా ఇంటర్వ్యూకి సంబంధించింది అని తెలుస్తుంది.

ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, టైంస్టాంప్ 22.10 వద్ద వైరల్ క్లిప్ మొదలు అవుతుంది అని తెలిసింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మల్లారెడ్డికి ఒక సరదా గేమ్ పెడుతుంది. యాంకర్ ఒక గిన్నె పెట్టి తను రాజకీయ నాయకుల పేరులు చెప్తుంటే ఆ నాయకులు మల్లారెడ్డికి ఇష్టం ఉంటే పూలు గిన్నెలో పడే విధంగా వేయాలని చెప్తుంది. అలా యాంకర్ మొదట మోదీ పేరు చెప్పగా మల్లారెడ్డి పువ్వు బయట పడేలా వేస్తాడు, తర్వాత రేవంత్ రెడ్డి పేరు చెప్పగా పువ్వును దూరంగా నేల కేసి కొడుతాడు, తదుపరి కేసిఆర్ అని చెప్పగా మల్లారెడ్డి పువ్వును కళ్ళకు అద్దుకొని గిన్నెలో వేస్తాడు, తర్వాత కేటీఆర్‌ పేరు చెప్పగా గుండెకు హత్తుకొని గిన్నెలో వేస్తాడు. వాస్తవంగా, మల్లారెడ్డి తనుకు మోదీ  అంటే ఇష్టం లేనట్లు, కేసీఆర్, కేటీఆర్‌ అంటే ఇష్టం ఉందని గేమ్ ద్వారా చెప్పారు. దీన్ని బట్టి ఈ వీడియోను ఎడిట్ చేస్తూ మల్లారెడ్డి తనకు కేసీఆర్, కేటీఆర్‌ అంటే ఇష్టం లేదని అర్ధం వచ్చేలా గేమ్ ఆడాడు అని వైరల్ వీడియోని రూపొందించారు అని నిర్ధారించవచ్చు.

చివరగా, BRS నాయకుడు మల్లారెడ్డి ప్రధాని మోదీపై తనకున్న అభిమానాన్ని తన ఆటతో చూపించారని ఒక ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు