భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, హోంమంత్రి అమిత్ షాకు ఇటీవల వంగి దండాలు పెట్టారని చెప్తూ ఒక AI-జనరేటెడ్ వీడియోను షేర్ చేస్తున్నారు

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, హోంమంత్రి అమిత్ షాకు నమస్కరిస్తున్న  వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘భారత ప్రధాన ఎన్నికల అధికారి… ఇదేనా భారత రాజ్యాంగం😥😥.. అత్యున్నత పదవుల్లో భారత ఎన్నికల వ్యవస్థ ను కాపాడాల్సిన బాధ్యత ఇదేనా’ అని చెప్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు 

క్లెయిమ్: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, హోంమంత్రి అమిత్ షాకు వంగి దండాలు పెడుతున్న సంఘటన వీడియో .

ఫ్యాక్ట్(నిజం): ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా AI ఉపయోగించి తయారు చేసిన వీడియో. 2023లో జ్ఞానేష్ కుమార్ కేంద్ర సహకార శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఒక కార్యక్రమంలో సత్కరిస్తున్నప్పుడు తీసిన ఒక ఫోటోను ఉపయోగించి దీన్ని తయారు చేశారు. ఆ కార్యక్రమంలో ఎక్కడా జ్ఞానేష్ కుమార్ వైరల్ వీడియోలో కనిపిస్తున్నట్లు చేయలేదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇటీవల భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, హోంమంత్రి అమిత్ షాకు వైరల్ వీడియోలో కనిపిస్తున్నట్టు నమస్కరించినట్లు మాకు ఎటువంటి మీడియా రిపోర్టులు లభించలేదు.  

ఇక ఈ వీడియో గురించి మరిన్ని వివరాల కోసం, అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసాము. ఈ సెర్చ్ ద్వారా ఈ వీడియోలోని మొదటి ఫ్రేమ్‌ను పోలిన ఫోటో ఒకటి మాకు హిందుస్థాన్ టైమ్స్ మీడియా వారి కంటెంట్ సిండికేషన్ వెబ్సైటు అయిన ‘కంటెంట్ గార్డెన్’లో లభించింది. ఈ ఫోటో వివరణలో, ఇది 8 నవంబర్ 2023న ఢిల్లీలో జరిగిన ఒక సింపోజియంలో తీసినది అని ఉంది.

జ్ఞానేష్ కుమార్ కేంద్ర సహకార శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ‘National Symposium on Promoting Organic Products through Cooperatives’ కార్యక్రమంలో శాలువా కప్పి సత్కరిస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది

ఈ సభ యొక్క లైవ్ స్ట్రీమ్ మాకు కేంద్ర సహకార శాఖ వారి అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో లభించింది. 8 నవంబర్ 2023న స్టీమ్ అయిన ఆ కార్యక్రమంలో 1:25:10 సెకన్ల దగ్గర జ్ఞానేష్ కుమార్, అమిత్ షాకు శాలువా కప్పడం మనం చూడవచ్చు. శాలువా కప్పిన తర్వాత ఆయన వైరల్ వీడియోలో కనిపిస్తున్నట్లు అమిత్ షాకు వంగి వంగి వందనాలు చేయలేదు కేవలం దండం పెట్టారు

తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన వీడియోలలో సహజంగా ఉండే అవకతవకలను మేము వైరల్ వీడియోలో గమనించాము. 

ఇది AI-జనరేటెడ్ వీడియోనా కాదా అని వెరిఫై చేయడానికి హైవ్ అనే AI-కంటెంట్ డిటెక్షన్ టూల్‌ ఉపయోగించి చెక్ చేయగా, వైరల్ వీడియోలో AI ఉపయోగించి తయారు చేసినదని మాకు తెలిసింది

చివరగా, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, హోంమంత్రి అమిత్ షాకు వంగి దండాలు పెట్టారని చెప్తూ ఒక AI-జనరేటెడ్ వీడియోను షేర్ చేస్తున్నారు.