‘మత్స్యకారులు వలలో చుట్టుకున్న సాగర కన్య’ అని చెప్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పశ్చిమ గోదావరి పేరుపాలెం బీచ్‌లో ఈ సంఘటన జరిగినదని చెప్తూ, ఈ వీడియోని సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: పశ్చిమ గోదావరి పేరుపాలెం బీచ్‌లో మత్స్యకారులు వలలో చుట్టుకున్న ఒక సాగర కన్యను చూపిస్తున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో. పశ్చిమ గోదావరి పేరుపాలెం బీచ్‌లో ఇటీవల ఈ సంఘటన జరిగినట్లు ఎటువంటి వార్తా కథనాలు లేవు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇటీవల పశ్చిమ గోదావరిలోని పేరుపాలెం బీచ్‌లో మత్స్యకారులకి ఈ వీడియోలో కనిపిస్తున్న సాగర కన్య దొరికిందని చెప్తూ మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు దొరకలేదు.
వైరల్ వీడియోని మేము సరిగ్గా పరిశీలించగా, అందులో కొన్ని చోట్ల సాగర కన్య వల లోపల ఉంటే మరి కొన్ని చోట్ల బయట ఉన్నట్లు కనపడడం, వీడియోలో ఉన్న మనుషుల కాళ్లు, చేతుల వేళ్లు వింతగా, సగం-సగం ఉండటం వంటి కొన్ని తప్పిదాలు కనిపించాయి. సాధారణంగా, ఇలాంటి తప్పిదాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన వీడియోలు మరియు ఇమేజ్‌లలో ఉంటాయి.
అందుచేత, ఇది AI-జనరేటెడ్ వీడియోనా కాదా అని వెరిఫై చేయడానికి, Hive అనే AI-కంటెంట్ డిటెక్షన్ టూల్ ఉపయోగించి చెక్ చేశాము. Hive యొక్క అనాలసిస్‌లో, 97.5% స్కోరుతో ఇది AI-జనరేట్ వీడియో అని తేలింది.
ఈ వీడియో గురించి మరిన్ని వివరాల కోసం అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వీడియో మాకు ‘Chris Perna’ అనే డిజిటల్ క్రియేటర్ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజీలో లభించింది.
దీన్ని తను 14 అక్టోబర్ 2025న అప్లోడ్ చేశాడు. ఈ పేజీ యొక్క బయోలో, తను ఒక ఫిల్మ్ డైరెక్టర్ అని Chris పేర్కొన్నాడు. అలాగే, సరదా కోసం AI హారర్స్ (AI ఉపయోగించి తయారు చేసిన హారర్ వీడియోలు) తయారు చేస్తాడని కూడా తన బయోలో ఉంది. తన పేజీలో వైరల్ వీడియో వంటి చాలా AI-జనరేటెడ్ వీడియోలు ఉన్నాయి (ఇక్కడ, ఇక్కడ).
చివరగా, పశ్చిమ గోదావరి పేరుపాలెం బీచ్‌లో మత్స్యకారులు వలలో సాగర కన్య చిక్కిందని చెప్తూ ఒక AI-జనరేటెడ్ వీడియోను షేర్ చేస్తున్నారు.