‘1992 సంవత్సరం భాగ్యనగరం (హైదరాబాద్) హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ శ్రీ గౌతమబుద్దుని విగ్రహం ప్రతిష్ట చూడని వారు ఇప్పుడు చూసి ఆనందంతో తరించగలరు’ అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) వైరల్ అవుతోంది. ఇందులో ఒక బుద్ధుడి విగ్రహాన్ని ఒక చెరువు గుండా తరలించి, అందులో ఒక చోట దాన్ని క్రేన్ల సహాయంతో కొందరు కార్మికులు నిలబెట్టడం మనం చూడవచ్చు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: 1992లో హైదరాబద్‌లోని హుస్సైన్ సాగర్‌లో గౌతమ బుద్ధుని విగ్రహ ప్రతిష్ట యొక్క నిజమైన వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఇది 1992 నాటి నిజమైన వీడియో కాదు, bharathfx1 అనే ‘డిజిటల్ క్రియేటర్; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ముందుగా, ఈ వీడియోని సరిగ్గా పరిశీలిస్తే, ఇందులో కొందరు వ్యక్తులకు రెండు రెండు చేతులు ఉండడం, ముఖాలు వింతగా ఉండడం, కొంతమంది రోడ్డుపై నడుస్తూ అకస్మాత్తుగా మాయమైపోవడం వంటి వింత విషయాలు మేము గమనించాము. సహజంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియోలలో, ఫోటోలలో ఇటువంటి తప్పిదాలు కనబడతాయి. అలాగే, వైరల్ వీడియో 1992లో హైదరాబద్‌లోని హుస్సైన్ సాగర్‌లో గౌతమ బుద్ధుని విగ్రహం ప్రతిష్ట చేస్తున్నప్పటిది అని చెప్తూ, దూరదర్శన్ ఛానల్ వారు గానీ, వేరే ప్రముఖ మీడియా సంస్థ వారు గానీ కథనాలను ప్రచురించినట్లు, మాకు ఇంటర్నెట్‌లో ఎటువంటి ఆధారాలు దొరకలేదు.
ఇక ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికాము. ఈ సెర్చ్ ద్వారా, ఈ వీడియోని 7 సెప్టెంబర్ 2025న ‘bharathfx1’ అనే డిజిటల్ క్రియేటర్ ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడని మాకు తెలిసింది. ఈ వీడియో యొక్క వివరణలో ఇందులో ఉన్న ఇమేజ్‌లు/వీడియోలు AI(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉపయోగించి తయారు చేసినవని ఒక నోట్ ఉంది.
Bharathfx1 యొక్క ఇన్స్టాగ్రామ్ పేజీలో AI ఉపయోగించి తయారు చేసిన చాలా ఫోటోలు, వీడియోలు ఉన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ పేజీ యొక్క బయాలో ‘3D Computer Graphics (VFX,Film & Animation) Video editing 💻 Film Making 🎥…’ అని రాసి ఉంది.
అలాగే, ఇది పూర్తిగా AI-ద్వారా రూపొందించిన వీడియో అని Hive అనే AI కంటెంట్ డిటెక్షన్ టూల్ నిర్ధారించింది.
చివరగా, 1992లో హుస్సేన్ సాగర్‌లో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ట చేసినప్పుడు చిత్రించిన నిజమైన దృశ్యాలని ఒక AI-జనరేటెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు.