పువ్వు ఆకారంలో ఉన్న జీవి నిజమైన వీడియో అని ఒక AI-జనరేటెడ్ వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు

ఒక పువ్వు ఆకారంలో ఉన్న జీవి మంచు కొండల్లో ఒకరి చేతి పైన వాలుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లు ఒక జీవి పుష్పం ఆకారంలో వచ్చింది అని చెప్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. అసలు ఈ వీడియో వెనుక ఎంత నిజం ఉందో చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పువ్వు ఆకారంలో ఉన్న ఒక నిజమైన జీవి వీడియో.

ఫ్యాక్ట్(నిజం): ఇది నిజమైన వీడియో కాదు. ఫ్లక్స్, క్లింగ్, ఎలెవెన్ ల్యాబ్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వంటి సాధనాలు ఉపయోగించి సృష్టించబడిన AI-జనరేటెడ్ వీడియో. ఇలాంటి జీవి ఉన్నట్టు ఆధారాలు లేవు. కావున, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ముందుగా, వైరల్ వీడియోలో కనిపిస్తున్నటువంటి జీవి ఇటీవల ఏదైనా కనిపించిందా అని వెరిఫై  చేయడానికి సంబంధిత కీ వర్డ్స్ ఉపయోగించి మేము ఇంటర్నెట్‌లో వెతకగా, ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేదు. అయితే, వీడియోను సరిగ్గా పరిశీలించగా, ఒక చోట ఆ జీవి వాలిన చెయ్యికి ఆరు వేళ్లు ఉండటం, వెనుక ఉన్న వ్యక్తుల అసహజ కదలికలు వంటి అనేక అసాధారణ విషయాలు మేము గమనించాము. సహజంగా, ఇలాంటివి AI-జనరేటెడ్ లేదా ఎడిట్ చేసి తయారు చేసిన వీడియోలలో ఉంటాయి.

తరువాత, వైరల్ వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేసి చూడగా, దాని అసలు వీడియో (ఆర్కైవ్) మాకు లభించింది. ఈ వీడియో 7 మార్చి 2025న ‘oleg.pars’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియో AI, ఫ్లక్స్, క్లింగ్, ఎలెవెన్ ల్యాబ్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వంటి డిజైన్ సాధనాలను ఉపయోగించి తయారు చేయబడింది అని ఈ పోస్ట్ స్పష్టంగా పేర్కొంది.

ఈ పేజీ యొక్క బయోలో ‘డిజిటల్ క్రియేటర్’ అని, ఇంకా ‘In constant (re)search of unbelievable creatures’ (నమ్మశక్యం కాని జీవుల కోసం నిరంతరం వెతుకుతున్నాము) అని రాసి ఉంది. ఈ పేజిలో వైరల్ వీడియోలో కనిపిస్తున్న వింత జీవి వంటి చాలా వింత జీవుల వీడియోలు ఉన్నాయి (ఇక్కడ, ఇక్కడ). అదనంగా, AI వీడియో డిటెక్టర్లు కూడా వైరల్ వీడియోను AI-ఉపయోగించి తయారు చేసిన వీడియో అని గుర్తించాయి.

చివరగా, పువ్వు ఆకారంలో ఉన్న జీవి నిజమైన వీడియో అని ఒక AI-జనరేటెడ్ వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు.