గులాబీ పువ్వు లాంటి తల ఉన్న పురుగు ఒకటి జన్మించిందని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: గులాబీ పువ్వు వంటి తలతో ఉన్న నిజమైన పురుగు.
ఫాక్ట్: ఇది నిజమైన వీడియో కాదు. ఫ్లక్స్, క్లింగ్, ఎలెవెన్ ల్యాబ్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వంటి సాధనాలు ఉపయోగించి సృష్టించబడిన AI-జనరేటెడ్ వీడియో. ఇలాంటి జీవి ఉన్నట్టు ఆధారాలు లేవు. కావున, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ముందుగా ఇటువంటి కీటకాన్ని ఏమైనా గుర్తించారా అని ఇంటర్నెట్లో వెతకగా, దీనికి సంబంధించిన ఎటువంటి వార్తా కథనాలు మాకు లభించలేదు. ఇక వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన పూర్తి వీడియోని ముందుగా 28 మార్చి 2025 నాడు ‘oleg.pars’ అనే ఇంస్టాగ్రామ్ పేజీలో అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. ఈ వీడియోని ఫ్లక్స్, మిడ్ జర్నీ, క్లింగ్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఎలెవన్ ల్యాబ్స్ వంటి ఆర్టిటీషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజైన్ సాధనాలను ఉపయోగించి రూపొందించినట్లు వివరణలలో పేర్కొన్నారు.
అలాగే, ఈ పేజీ యొక్క బయోలో ‘డిజిటల్ క్రియేటర్’ అని, ఇంకా ‘In constant (re)search of unbelievable creatures’ (నమ్మశక్యం కాని జీవుల కోసం నిరంతర అన్వేషణ) అని రాసి ఉంది. గతంలో అనేకసార్లు పువ్వుల రూపంలో ఉండే కీటకాలను యొక్క AI వీడియోలను ఈ ఇంస్టాగ్రామ్ పేజీలో అప్లోడ్ చేయబడ్డాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
అదనంగా, AI వీడియో డిటెక్టర్లు కూడా వైరల్ వీడియోను AI-ఉపయోగించి తయారు చేసిన వీడియో అని గుర్తించాయి.
చివరిగా, గులాబీ పువ్వు తలతో ఉన్న నిజమైన కీటకాన్ని గుర్తించారంటూ ఒక AI-జనరేటెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు.