ఒక మాల్‌లో భారీ అక్వేరియం కూలిపోతున్న దృశ్యాలంటూ AI ద్వారా రూపొందించిన వీడియోను షేర్ చేస్తున్నారు

“మాల్‌లో కుప్పకూలిన అక్వేరియం” అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియో నిజమైన ఘటనను చూపిస్తున్నట్లు పలువురు యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తున్న కొంతమంది ఈ సంఘటనలో 50 మంది మరణించారని పేర్కొన్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక మాల్‌లో భారీ అక్వేరియం కూలిపోతున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో నిజమైన దృశ్యాలను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఇది AI ద్వారా రూపొందించబడిందని పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా, వైరల్ పోస్టులలో పేర్కొన్నట్లుగా ఇటీవల ఎక్కడైనా ఒక మాల్‌లో భారీ అక్వేరియం కూలిపోయి 50 మంది మరణించారా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇటీవల ఏ మాల్‌లోనైనా ఒక భారీ అక్వేరియం కూలిపోయి పలువురు వ్యక్తులు మరణించినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లభించలేదు.

అలాగే, ఈ వైరల్ వీడియోను మనం జాగ్రతగా పరిశీలిస్తే, ఈ వీడియోలోని దృశ్యాలు అసహజంగా ఉండటం మనం గమనించవచ్చు. ఈ వీడియోలో, అక్వేరియం కూలిపోయిన తర్వాత నీలిరంగు (blue) టీ-షర్టు ధరించిన యువతి అకస్మాత్తుగా నీటిలో అదృశ్యమవడం వంటి పలు తప్పిదాలు/ అసమానతలు (errors/inconsistencies) మనం స్పష్టంగా చూడవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిన దృశ్యాలలో ఇటువంటి లోపాలు సహజంగానే ఉంటాయి (ఇక్కడఇక్కడ). దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించి ఉండవచ్చని తెలుస్తోంది.

https://factly.in/wp-content/uploads//2025/08/Aquarium-collapses-in-Shopping-Mall-img1.mp4

తదుపరి ఈ వైరల్ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను (ఆర్కైవ్డ్), 04 ఆగస్టు 2025న టిక్‌టాక్‌లో ‘@the.worldai’ అనే యూజర్ అప్‌లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో వివరణలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఈ వీడియో రూపొందించినట్లు యూజర్ పేర్కొన్నారు.  అలాగే, ఈ పేజీ (@the.worldai) వివరణలో కూడా ఈ పేజీలోని AI సహాయంతో రూపొందించిన వీడియోలు/దృశ్యాలు పోస్టు చేస్తుందని పేర్కొన్నారు. ఈ ఛానెల్‌లో మనం ఇలాంటి AI జనరేటెడ్ వీడియోలను చాలా చూడవచ్చు.

ఇదే వీడియో ‘@the.worldai’కు సంబంధించిన యూట్యూబ్ ఛానెల్‌లో 04 ఆగస్టు 2025న అప్‌లోడ్ చేయబడినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో వివరణలో కూడా ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడిందని పేర్కొనబడింది.

తదుపరి ఈ వైరల్ వీడియో AI- ఉపయోగించి తయారు చేసిందా? లేదా? అని నిర్ధారించడానికి, Hive వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి ఈ వైరల్ వీడియోను పరిశీలించగా, ఈ వీడియో 97.6% AI- జనరేటెడ్ కావచ్చని Hive ఫలితాన్ని ఇచ్చింది. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు.

ప్రపంచంలోనే అతిపెద్ద అక్వేరియంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన సుమారు 82 అడుగుల ఎత్తైన సిలిండర్ ఆకారపు అక్వేరియం ‘అక్వాడమ్’, జర్మనీలోని బెర్లిన్ లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఉండేది. కానీ, అది డిసెంబర్ 2022లో అకస్మాత్తుగా బద్దలైంది. రిపోర్ట్స్ ప్రకారం, అందులోని 1,500 చేపలు చనిపోవడంతో పాటు, 10 లక్షల లీటర్ల పై చిలుకు నీళ్లు అక్వేరియమున్న హోటల్‌తో పాటు పరిసర వీధులనూ ముంచెత్తాయి. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరిగినట్లు రిపోర్ట్స్ లేవు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ)

చివరగా, ఒక మాల్‌లో భారీ అక్వేరియం కూలిపోతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్న ఈ వీడియో AI ద్వారా రూపొందించింది.