రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ‘ఐ లవ్ ముహమ్మద్’ టీ-షర్టు ధరించారని చెప్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన చిత్రాన్ని షేర్ చేస్తున్నారు

‘ఐ లవ్ ముహమ్మద్ ‘I Love Muhammad’ పోస్టర్‌పై నెలకొన్న వివాదం దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, మౌ నగరాల్లో 26 సెప్టెంబర్ 2025 శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. బరేలీలో పోలీసులు లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. ఈ ఘటనలకు సంబంధించి కనీసం 12 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)  నాయకుడు తేజస్వీ యాదవ్ ‘ఐ లవ్ ముహమ్మద్’ టీ-షర్టులు ధరించి దిగిన ఫోటో (ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ ఫోటో వెనుక ఉన్న నిజానిజాలు ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు క్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ‘ఐ లవ్ ముహమ్మద్’ టీ-షర్ట్ ధరించి దిగిన నిజమైన ఫోటో.

ఫ్యాక్ట్(నిజం): ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన ఫోటో, నిజమైన ఫోటో కాదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ‘ఐ లవ్ ముహమ్మద్’ నిరసనలకు మద్దతు ఇస్తూ ‘ఐ లవ్ ముహమ్మద్’ అనే వాక్యం ఉన్న టీ-షర్టులు ధరించారని రిపోర్ట్ చేసిన ఎటువంటి వార్తా కథనాలు మాకు లభించలేదు. అలాగే, ఈ ఫోటో కోసం మేము రాహుల్ గాంధీ, తేజస్వీల సోషల్ మీడియా పేజీలలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ)  వెతకగా, వాటిల్లో కూడా మాకు ఇది లభించలేదు.

ఇక ఈ ఫోటో గురించి మరిన్ని వివరాల కోసం, ఆ ఫోటో ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసాము. ఈ సెర్చ్ ద్వారా, వైరల్ ఫోటో యొక్క High Quality వెర్షన్ మాకు ‘Deeni Scholars’ అనే ఫేస్‌బుక్ పేజీలో లభించింది.

ఇదే పేజీ వారు పోస్ట్ చేసిన ఒక AI(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) – జనరేటెడ్ ఇమేజీ ఒకటి, కొద్ది రోజులో క్రితం రాహుల్, ప్రియాంకా గాంధీలు ‘ఐ లవ్ ముహమ్మద్’ పోస్టరు పట్టుకొని దిగిన నిజమైన ఫోటో అని సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, మేము అది తప్పు అని ఒక ఆర్టికల్ ప్రచురించాము.

ఈ ఫోటో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసినదే అయి ఉంటుందనే అనుమానంతో, హైవ్ అనే AI కంటెంట్ డిటెక్షన్ టూల్ ఉపయోగించి చూడగా, ఇది 100 శాతం AI జనరేటెడ్ కంటెంట్ అని మాకు తెలిసింది

చివరగా, రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ‘ఐ లవ్ ముహమ్మద్’ టీ-షర్టు ధరించి దిగిన నిజమైన ఫోటో అని చెప్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన చిత్రాన్ని షేర్ చేస్తున్నారు.