జార్జ్ సోరోస్ కుమారుడు అలెక్స్ సోరోస్ వివాహానికి రాహుల్ గాంధీ హాజరైన దృశ్యాలంటూ షేర్ చేస్తున్న ఈ ఫోటో AI ద్వారా రూపొందించింది

జార్జ్ సోరోస్ కుమారుడు అలెక్స్ సోరోస్, గతంలో హిల్లరీ క్లింటన్‌కు సహాయకురాలిగా పనిచేసిన హుమా అబెదిన్‌ను 14 జూన్ 2025న న్యూయార్క్‌లోని హాంప్టన్స్‌లో సోరోస్ నివాసంలో వివాహం చేసుకున్నాడు (ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ పెళ్లికి హాజరైనట్లు పేర్కొంటూ ఒక ఫోటో (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జార్జ్ సోరోస్ కుమారుడు అలెక్స్ సోరోస్ వివాహానికి రాహుల్ గాంధీ హాజరైన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): వైరల్ అవుతున్న ఫోటో నిజమైనది కాదు. దీనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో రూపొందించారు. వైరల్ ఫోటోలో “GROK” అనే వాటర్‌మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా, Hive, Sightengine వంటి టూల్స్‌తో పరీక్షించగా, ఇది 99%కి పైగా AI-తో తయారైనదని తేలింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ ఫోటోను జాగ్రతగా పరిశీలిస్తే, ఇందులో పలు తప్పిదాలు/ అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదు, ఈ ఫోటోలో కుడివైపు క్రింద భాగంలో “Grok” అనే వాటర్‌మార్క్‌ను మనం చూడవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిన దృశ్యాలలో ఇటువంటి లోపాలు సహజంగానే ఉంటాయి (ఇక్కడ, ఇక్కడ). దీన్ని బట్టి ఈ వైరల్ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించి ఉండవచ్చని తెలుస్తోంది.

తదుపరి ఈ వైరల్ ఫోటో AI- ఉపయోగించి తయారు చేశారా? లేదా? అని నిర్ధారించడానికి, Hive, Sight engine వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ని ఉపయోగించి ఈ ఫోటోను పరిశీలించగా, ఈ వైరల్ ఫోటో 99.9% AI-జనరేటెడ్ కావచ్చని Hive ఫలితాన్ని ఇచ్చింది. ఈ వైరల్ ఫోటో 99% AI-జనరేటెడ్ కావచ్చని Sight engine ఫలితాన్ని ఇచ్చింది. దీన్ని బట్టి ఈ వైరల్ ఫోటో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు.

రాహుల్ గాంధీ జార్జ్ సోరోస్ కుమారుడి పెళ్లికి హాజరయ్యారా అనే విషయాన్ని మేము స్వతంత్రంగా నిర్ధారించలేకపోయినప్పటికీ, అందుబాటులో ఉన్న ఆధారాలు బట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ సాయంతో తయారుచేయబడినది అని నిర్థారించగలము. 

చివరిగా, జార్జ్ సోరోస్ కుమారుడు అలెక్స్ సోరోస్ వివాహానికి రాహుల్ గాంధీ హాజరైన దృశ్యాలంటూ షేర్ చేస్తున్న ఈ ఫోటో AI ద్వారా రూపొందించింది.