Fake News, Telugu
 

భారతీయ మీడియా ప్రస్తుత స్థితిని వర్ణిస్తూ అమెరికన్ కార్టూనిస్ట్ బెన్ గారిసన్ ఎటువంటి కార్టూన్ గీయలేదు

0

అమెరికన్ కార్టూనిస్టు బెన్ గారిసన్ భారతీయ మీడియా ప్రస్తుత స్థితిని వర్ణిస్తూ గీసిన కార్టూన్ అంటూ ఒక ఫోటో సోషల్ మీడియా లో విస్తారంగా చలామణీ అవుతోంది. ఆ ఫొటోలో ఒక కుక్కల సమూహం ఉంటుంది మరియు వాటికి తలల బదులుగా ఫౌంటెన్ పెన్ నిబ్స్ ఉంటాయి. అవన్నీ ఒక వ్యక్తి ఎరగా చూపిస్తున్న మాంసపు బొక్క వైపు ఆశగా చూస్తూ ఉంటాయి. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారతీయ మీడియా ప్రస్తుత స్థితిని వర్ణిస్తూ అమెరికన్ కార్టూనిస్ట్ బెన్ గారిసన్ గీసిన కార్టూన్ ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టు లో ఉన్న కార్టూన్ ఫోటో కనీసం 2009 నుండి సోషల్ మీడియా లో చలామణీ అవుతోంది. అయితే దానిని అమెరికన్ కార్టూనిస్ట్ బెన్ గారిసన్ భారతీయ మీడియా స్థితిని వర్ణిస్తూ గీసినట్లుగా సమాచారమేమీ లేదు. బెన్ గారిసన్ 2017లో చేసిన ఒక ట్వీట్ లో తాను ఎప్పుడూ కూడా భారత రాజకీయాలకి సంబంధించి కార్టూన్లు వేయలేదని, అలా తన పేరు మీద చలామణీ అవుతున్న కార్టూన్ లు ఫేక్ అని స్పష్టం చేశారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికినప్పుడు, అందుకు సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ చాలా వచ్చాయి. అయితే ఫోటోకి టైంఫిల్టర్ పెట్టి వెతికినప్పుడు, అది మొట్టమొదటగా ఒక పర్షియన్ వెబ్సైటు ‘adeli-af.com’ సెప్టెంబర్ 2009 లో ప్రచురించిన కథనంలో ఉన్నట్లుగా తెలిసింది. ఆ కథనాన్ని ఆఫ్గనిస్తాన్ దేశం లోని విద్యావేత్తల మరియు రచయితల గురించి ప్రస్తావిస్తూ రాసారు. అందులో ఆ కార్టూన్ ని ఎవరు గీశారనే సమాచారమేమీ లేదు. 

అమెరికన్ కార్టూనిస్ట్ బెన్ గారిసన్ అధికారిక వెబ్సైటు లో వెతికినా కూడా అతను ఆ కార్టూన్ ని భారతీయ మీడియా పరిస్థితి ని వివరిస్తూ వేసినట్లుగా సమాచారం లభించలేదు. అయితే బెన్ గారిసన్ 2017లో చేసిన ఒక ట్వీట్ లో తాను ఎప్పుడూ కూడా భారత రాజకీయాలకి సంబంధించి కార్టూన్లు వేయలేదని, అలా తన పేరు మీద చలామణీ అవుతున్న కార్టూన్ లు ఫేక్ అని స్పష్టం చేశారు. కావున, ఫోటోలోని కార్టూన్ అమెరికన్ కార్టూనిస్టు బెన్ గారిసన్ భారతీయ మీడియా స్థితిని వర్ణిస్తూ గీసినది కాదు.  

2017లో ఫేస్బుక్ లో మరొక కార్టూన్ (ఆర్చివ్డ్) కూడా ఇదే ఆరోపణ తోనే (అమెరికన్ కార్టూనిస్టు బెన్ గారిసన్ భారతీయ మీడియా ప్రస్తుత స్థితిని వర్ణిస్తూ గీసిన కార్టూన్) చలామణీ అయినట్లుగా తెలిసింది. ఆ ఫొటోకి ‘Lipstick on a pig’ అనే టైటిల్ ఉంటుంది. అందులో పంది పిల్లల తల్లికి మోదీ ముఖం యొక్క హాస్య చిత్రం ఉంటుంది మరియు కొన్ని మీడియా ఛానెల్ ల లోగోలు తల్లి పాలు తాగుతున్న ఆ పంది పిల్లలపై ఉంటాయి. ఆ కార్టూన్లో కనిపించే ఒక కుక్కపై ‘భగవత్’ (ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్) అని ఉంటుంది.

అయితే, ఆ ఫోటో ఫోటోషాప్ చేసినదనే సమాచారం మా విశ్లేషణ లో లభించింది. వాస్తవ ఫోటో ని బెన్ గారిసన్ 2016 లో అమెరికా రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో గీసారు. ఆ ఫోటో లో తల్లి పంది కి హిల్లరీ క్లింటన్ ముఖం యొక్క హాస్య చిత్రం ఉంటుంది మరియు ఆ పంది పిల్లల మీద ‘అబద్ధాలు’, ‘నేరప్రవృత్తి’, ‘అవినీతి’, ‘దొంగతనం’ అనే పదాలు ఉంటాయి. ఆ కార్టూన్ నేపధ్యం లో కనిపించే ఒక కుక్కపై ‘బిల్’ అని ఉంటుంది.

భారతీయ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య 2017 లో పెట్టిన ఒక ట్వీట్ లో, ఫోటోషాప్ చేసిన కార్టూన్ లోని నరేంద్ర మోదీ ముఖాన్ని 2010 లో మోదీ కి 60 ఏళ్ళు నిండినప్పుడు  తాను గీసిన వ్యంగ్య కార్టూన్ నుండి తీసారని స్పష్టం చేశారు.

చివరగా, భారతీయ మీడియా ప్రస్తుత స్థితిని వర్ణిస్తూ అమెరికన్ కార్టూనిస్ట్ బెన్ గారిసన్ కార్టూన్లనేమీ గీయలేదు. 

Share.

About Author

Comments are closed.

scroll