చైత్ర నవరాత్రి, రామ నవమి పండుగలు ఘనంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అఖిలేష్ యాదవ్ స్వాగతించారు

చైత్ర నవరాత్రి, శ్రీరామ నవమి పండుగ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, ప్రతిపక్షనేత అయిన సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఇది అనవసరమైన చర్య అని, ప్రజల డబ్బుని దండగ చేస్తున్నారని వ్యాఖ్యానించినట్లు చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: చైత్ర నవరాత్రి, శ్రీరామ నవమి పండుగ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అఖిలేష్ యాదవ్ వ్యతిరేకిస్తూ దీనిని అనవసర చర్యగా పేర్కొన్నారు.

ఫాక్ట్: ఈ నిర్ణయాన్ని అఖిలేష్ స్వాగతించడమే కాకుండా యూపీ ప్రభుత్వం జిల్లాకు రూ. లక్ష చొప్పున ఇస్తానన్న మొత్తాన్ని రూ. 10 కోట్లకు పెంచి అన్ని మతాల పండుగలను జరపాలని ఆయన సూచించారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

మీడియా కథనాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చైత్ర నవరాత్రి మరియు శ్రీరామ నవమి పండుగలకి సంబంధించి వివిధ కార్యక్రమాలను జరపాలని అన్నీ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు గాను ఒక్కొక్క జిల్లాకు రూ. లక్ష చొప్పున కళాకారుల ఖర్చుల నిమిత్తం అందచేయనున్నట్లు తెలిపింది.

అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అఖిలేష్ యాదవ్ స్వాగతిస్తూ, లక్ష రూపాయలు చాలా తక్కువ మొత్తమని, అన్ని మతాల పండుగలు జరుపుకోవడానికి కనీసం 10 కోట్ల రూపాయలను ఇవ్వాలంటూ 14 మార్చి 2023న తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నాడు. అలాగే బీజేపీ ప్రభుత్వం పండుగల నాడు ప్రజలకి ఉచిత గ్యాస్ సిలిండర్‌లను ఇవ్వాలని, అది ఈ శ్రీరామనవమితోనే మొదలవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

చివరిగా, చైత్ర నవరాత్రి, శ్రీరామ నవమి పండుగ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అఖిలేష్ యాదవ్ వ్యతిరేకించాడని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు.