ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సంఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో, ఇజ్రాయెల్ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇరాన్‌కి క్షమాపణలు చెప్తూ యుద్ధం ఆపమన్నట్లు వేడుకుంటున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: యుద్ధం ఆపమని ఇరాన్‌కి క్షమాపణలు చెప్తున్న ఇజ్రాయెల్ ప్రజల యొక్క వీడియో.
ఫాక్ట్: ఇది ‘గూగుల్ వియో’ ద్వారా రూపొందించబడిన AI వీడియో. నిజమైన సంఘటన కాదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా, వైరల్ వీడియోని పరిశీలించగా అందులో చాలా అసమానతలు ఉన్నట్లు గమనించాం. వీడియోలోని నిరసనకారుల ముఖాలు అసహజంగా ఉండడం, వారు పట్టుకున్న ప్లకార్డులలో అక్షర దోషాలు ఉండడం చూడవచ్చు. అలాగే, ఒక వ్యక్తి చేతి నుంచి అకస్మాత్తుగా ఇజ్రాయెల్ జెండా రావడం కూడా చూడవచ్చు. వీటికి తోడు, వీడియోలో కుడి వైపు దిగువున ‘Veo’ అని వాటర్ మార్క్ ఉండడంతో ఈ వీడియో గూగుల్ వియో ఏఐ మోడల్ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సాయంతో రూపొందించినట్లు తెలుస్తుంది.
ఈ మోడల్‌తో రూపొందించిన వీడియోలను గుర్తించే గూగుల్‌కి చెందిన synth ID అనే సాధనం కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది.
అదనంగా, హైవ్ వంటి ఇతర సాధనాలు కూడా వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని నిర్ధారించాయి. పైగా, యుద్ధం ఆపాలని ఇజ్రాయెల్ ప్రజలు ఇరాన్‌కి క్షమాపణలు నిరసనలు చేపట్టినట్లు ఎక్కడా మాకు విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేదు.
చివరిగా, యుద్ధం ఆపమని ఇజ్రాయెల్ ప్రజలు ఇరాన్‌కి క్షమాపణలు చెప్తున్నట్లుగా ఉన్న ఈ వీడియో AI ద్వారా రూపొందించబడింది.