ఒక ముస్లిం వ్యక్తి డ్రైనేజీ నీరు ఉపయోగించి బిర్యానీ వండుతున్న నిజమైన దృశ్యాలని చెప్తూ ఒక AI-జనరేటెడ్ వీడియోను షేర్ చేస్తున్నారు

ఒక వ్యక్తి తను వండుతున్న బిర్యానీలో డ్రైనేజీ నీటిని పోస్తున్నట్టు కనిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ‘#Tuarka బిర్యాని హే ఇట్లాంటివీ చూసి మనసు పాడు చేసుకోవద్ద ఏదో కొంచెం బిర్యానిల నీళ్ళు తక్కువ పడి ఉండకపోతే బిర్యాని టేస్టీగా ఉండదు అని ఈ నీళ్ళు పోశాడు #BillaMiya మీరు ఏ మాత్రం సంకోచించకుండా తినేయండి’ అనే వివరణతో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక ముస్లిం వ్యక్తి, తను తయారు చేస్తున్న బిర్యానీలో డ్రైనేజీ నీళ్లు పోస్తున్న సంఘటనకు చెందిన వీడియో. 

ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసిన వీడియో, డ్రైనేజీ వాడి బిర్యానీ చేస్తున్న నిజమైన వీడియో కాదు.  ఇది AI-జనరేటెడ్ వీడియో అని, AI కంటెంట్ డిటెక్షన్ టూల్స్ గుర్తించాయి. ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి మరిన్ని వివరాల కోసం వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా, ఈ సంఘటన జరిగింది అని చెప్తూ మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు.

వైరల్ వీడియో వంటి వీడియో ఒకటి గతంలో మేము ఫ్యాక్ట్-చెక్ చేశాము, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో. ఇక, ఈ వీడియో కూడా AI జనరేటెడ్ అయి ఉండవచ్చని, ఈ వీడియోను హైవ్, deepfake-o-meter వంటి AI-కాంటెంట్ డిటెక్షన్ టూల్స్ ఉపయోగించి చూసాము. ఇది AI-జనరేటెడ్ వీడియో అని అవి గుర్తించాయి (ఇక్కడ, ఇక్కడ). 

అదనంగా, ఈ వీడియో యొక్క విశ్వసనీయతను పరిశీలించమని ఫ్యాక్ట్‌లీ భాగస్వామిగా ఉన్న ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ అలయన్స్ (TIA) వారిని మేము కోరము. ఈ వీడియోను వారు ఎనలైజ్ చేసి, ఇది పూర్తిగా AI ఉపయోగించి తయారు చేసినదని వారు మాకు తెలిపారు. 

AI-జనరేటెడ్ బిర్యానీ వీడియోల ట్రెండ్

గత కొంత కాలంగా, బిర్యానీలో మురికి నీళ్లు లేదా డ్రైనేజీ నీళ్లు వేస్తూ, వండుతున్న అనేక AI-జనరేటెడ్ వీడియోలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ)  సోషల్ మీడియాలో షేర్ చేయబడుతున్నాయని మేము గమనించాము. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో కూడా ఆ కోవలోకి చెందినదే.

చివరగా, ఒక ముస్లిం వ్యక్తి డ్రైనేజీ నీరు ఉపయోగించి బిర్యానీ వండుతున్న నిజమైన దృశ్యాలని చెప్పి ఒక AI-జనరేటెడ్ వీడియోను షేర్ చేస్తున్నారు.